ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన వాహనాలను సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 వాహనాలకు సీఎం జెండా ఊపి ప్రారంభించారు. వీటితోపాటు కార్డు దారులకు సంచులను కూడా ఉచితంగా సరఫరా చేయనున్నారు. ఏపీలో మొత్తం 9,260 వాహనాలను వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. రూ.539 కోట్లతో ఈ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రేషన్ డోర్ డెలివరీ చేసే వారికి ఈ వాహనాలను 50 శాతం రాయితీపై అందించారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా సమకూర్చారు. లబ్ధిదారుడు వాహనం తీసుకునే ముందు రూ.58 వేలు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి లబ్ధిదారుడు ప్రతి నెలా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
వచ్చే నెల నుంచి ఇంటికే రేషన్
రేషన్ డోర్ డెలివరీ చేసేందుకు అవసరమైన వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల రేషన్ ఇప్పటికే పూర్తయినందున వచ్చే నెల నుంచి రేషన్ డోర్ డెలివరీ చేయనున్నారు. ఒక్కో వాహనం ద్వారా రోజుకు 90 మందికి తగ్గకుండా 18 రోజుల పాటు రేషన్ డోర్ డెలివరీ చేయనున్నారు. ఇప్పటికే వాలంటీర్లు రేషన్ లబ్ధిదారుల ఇళ్ల వద్ద జీపీఎస్ ట్యాగ్ చేశారు. దీని ద్వారా రియల్ టైమ్‌లో ఎంతమందికి రేషన్ డోర్ డెలివరీ చేశారో తెలుసుకోవడానికి వీలవుతుంది.
Must Read ;- వైసీపీ సర్కారు షాక్.. భారీగా రేషన్ కార్డుల తొలగింపు