ఏపీ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఒకేసారి 8.44 లక్షల రేషన్ కార్డుల కోత వేసింది. దీని ద్వారా 24.52 లక్షల మంది రేషన్‌కు దూరం కానున్నారు. గత నెలలో ఏపీలో కోటి 52 లక్షల 70వేల రేషన్ కార్డులుండగా, తాజాగా వాటి సంఖ్య 1,44,26,000 తగ్గింది. అంటే ఒకేసారి 8.44 లక్షల కార్డులకు కోత వేశారు. ఈ విషయం తెలియని చాలా మంది రేషన్ షాపుల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకీ తీసుకోకపోవడంతో కార్డుల తొలగింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పేదలు గగ్గోలు పెడుతున్నారు.
ఎందుకు తొలగించారంటే..
గత ఏడాది వైసీపీ ప్రభుత్వం నవశకం సర్వే నిర్వహించింది. దీని ద్వారా గత ఏడాది నవంబరులో 17 లక్షల కార్డులు తొలగించాలని నిర్ణయించారు. అయితే ఒకేసారి 17 లక్షల కార్డులు తొలగిస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. తాజాగా వచ్చే నెల నుంచి రేషన్ డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రభుత్వంపై అదనంగా మరో రూ.750 కోట్లు భారం పడే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు ఖర్చు తగ్గించుకోవాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే అధికారులు 8.44 లక్షల రేషన్ కార్డులకు కోత వేశారని తెలుస్తోంది. ఈ కోత ద్వారా ప్రభుత్వానికి ఏటా వెయ్యి కోట్లు ఆదా అవుతాయని అంచనా. ఈ మొత్తం ద్వారా రేషన్ డోర్ డెలివరీ ఖర్చులు కవర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది.
Must Read ;- పంటల బీమాపై దిగొచ్చిన ప్రభుత్వం.. టీడీపీ వ్యూహంతో వైసీపీ కలవరం
ఈ ఆరులో ఒకటి ఉన్నా రేషన్ కట్..
రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం ఆరు నిబంధనలు విధించింది. ఇందులో ఏ ఒక్కదాని పరిధిలోకి లబ్ధిదారులు వచ్చినా రేషన్ కార్డు కట్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డులకు అనర్హులు. కేంద్ర, రాష్ట్రాలతోపాటు, ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు రేషన్ కార్డులు కట్ చేశారు. ఇక ఆదాయపన్ను చెల్లింపుదారులు కూడా రేషన్ కార్డు ప్రయోజనాలకు అనర్హులు. నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడుకుంటే వారు ధనవంతుల కిందే లెక్క. టాక్సీలు, ట్రాక్టర్లు మినహా ఇంట్లో ఏదైనా నాలుగు చక్రాల వాహనం ఉంటే వారికి రేషన్ కార్డు కట్ చేయాలని నిర్ణయించారు. పది ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి, 1000 గజాల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు వంటి వాటిలో ఏ ఒక్కటి ఉన్నా వారికి రేషన్ కార్డులు తీసివేయాలని ప్రభుత్వం వాలంటీర్లను ఆదేశించింది. వచ్చే నెల నుంచి రేషన్ డోర్ డెలివరీలో భాగంగా ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుల ఇళ్ల వద్ద వాలంటీర్లు జియో మ్యాపింగ్ చేస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన నవశకం సర్వేలోనే అనర్హులను గుర్తించారు. కార్డుల తొలగింపు నిర్ణయం మాత్రం ఈ నెల నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ నిర్ణయంపై రేషన్ లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ తరవాత పింఛన్
ప్రస్తుతానికి రేషన్ కార్డుల కోత వేసిన ప్రభుత్వం, తరవాత సామాజిక పింఛన్లు ఏరివేయాలని నిర్ణయించింది. దీనిపై వాలంటీర్లు నెల రోజుల నుంచి సర్వే కూడా ప్రారంభించారు. రెండూ ఒకేసారి కట్ చేస్తే జనంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ప్రస్తుతానికి పింఛన్ల ఏరివేతలు నిలిపివేశారు. వెంటనే వాలంటీర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరల ఆదేశాలు వచ్చే వరకు పింఛన్ల ఏరివేత సర్వే నిలిపి వేయాలని వాలంటీర్లను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ నుంచి పింఛన్ పరిమితి పెంచాలని ఏపీ సీఎం నిర్ణయించారు. ఈ విషయం సీఎం స్వయంగా అసెంబ్లీలో కూడా ప్రకటించారు. అప్పటి వరకూ పింఛన్ల ఏరివేత లేకుండా ఇలాగే కొనసాగించాని నిర్ణయించారు. వచ్చే జూన్ నుంచి పింఛన్లు రూ.250 పెంచి రూ.2,500 చేయడం ద్వారా ప్రభుత్వంపై అదనంగా నెలకు రూ.300 కోట్ల భారం పడనుంది. దీన్ని కవర్ చేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న పింఛన్లలో పది శాతం నుంచి 15 శాతం దాకా కోత వేసే అవకాశం ఉంది. వచ్చే ఏప్రిల్ లో సర్వే చేసి మేలో 8 నుంచి 10 లక్షల పింఛన్లు తీసివేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. పింఛన్ల ఏరివేత వ్యవహారాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారని తెలుస్తోంది.
Also Read;- రిజెక్ట్ : రేషన్ కందిపప్పు మాకొద్దు సామీ