ఏపీలో వింత పరిస్థితి నెలకొంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్ ద్వారా ఇస్తున్న కిలో కందిపప్పు ధరను రూ.40 నుంచి ఒకే సారి రూ.67 చేశారు. అవికూడా నాసిరకంగా ఉండటంతో చాలా మంది రేషన్ లబ్దిదారులు కందిపప్పు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. రేషన్ షాపుల్లో ఇస్తున్న కందిపప్పు ధరకు మరో రూ.10 పెట్టుకుంటే మార్కెట్లో మంచి నాణ్యమైన పప్పు దొరుకుతోంది. దీంతో పలు జిల్లాల్లో రేషన్ లబ్దిదారులు కందిపప్పు తీసుకోవడం లేదని రేషన్ డీలర్లు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఆలోచనలో పడింది.
ధర తగ్గిస్తారా?
ఏపీలో రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న కందిపప్పు ధరలు పెంచిన ప్రభుత్వం ఒకేసారి కిలోకు 27 పెంచి అనాలోచిత నిర్ణయం తీసుకుందేమోననిపిస్తోంది. మార్కెట్లో సగటున కంది పప్పు ధర కిలోకు రూ.70 నుంచి నాణ్యతను బట్టి రూ.85కు దొరుకుతోంది. ఇవన్నీ పట్టించుకోకుండా కందిపప్పు ధరలు పెంచారు. లబ్దిదారులు ఎవరూ తీసుకోవడం లేదు. దీంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ధర తగ్గించాలా లేదంటే, ఇదే అదునుగా కందిపప్పు కూడా రేషన్ దుకాణాల నుంచి తీసివేయాలా అని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
వచ్చే నెల నుంచి డోర్ డెలివరీ
జనవరి ఒకటి నుంచి రేషన్ డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అదనంగా రూ.650 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వంపై ఒక్క రూపాయి అదనపు భారం పడకుండా చూడాలని సీఎం ఆదేశించడంతో రేషన్ ద్వారా ఇస్తున్న అరకిలో పంచదార, కిలో కందిపప్పు ధరలు అమాంతం పెంచారు. ఈ పెంపు ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.700 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. రేషన్ డోర్ డెలివరీకి అయ్యే ఖర్చులను ఈ విధంగా సరకుల ధరలు పెంచడం ద్వారా కవర్ చేయాలని అధికారులు భావించారు. అయితే లబ్దిదారులు కందిపప్పు తీసుకోకపోవడంతో అధికారులు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
సన్నబియ్యం ఇస్తారా?
వచ్చేనెల ఒకటి నుంచి సన్నబియ్యం డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం దొడ్డుబియ్యం సేకరించి గిడ్డంగులు నింపిపెట్టారు. లబ్దిదారులకు ఇస్తున్న రేషన్ రీసైక్లింగ్ చేసి మరలా ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారు. అవే ఒకటో తేదీ నుంచి ఇస్తారా, లేదంటే సన్న బియ్యం వాటిల్లో కలుపుతారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం పంపిణీ చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీసే ధైర్యం కూడా చేయడం లేదనే చెప్పాలి. సన్నబియ్యంపై అడిగితే ఎవరు చెప్పారు? నీయమ్మ మొగుడు చెప్పాడా? అని మరలా బూతులతో విరుచుకుపడతారేమో అనే భావనలో ప్రతిపక్షాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రేషన్ లో మరిన్ని మార్పులు వచ్చేలా కనిపిస్తున్నాయి.
Must Read ;- క్రిస్మస్ వెలుగులు..ఇళ్ల స్థలాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్