అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో త్వరలో అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ రాబోతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఐఐటీ మద్రాస్‌తో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. క్వాంటమ్ టవర్‌ను నిర్మించడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన అన్ని అత్యాధునిక సాంకేతికతలు అందులో ప్రదర్శనకు ఉంచుతామన్నారు. ఈ వ్యాలీని దేశానికి కానుకగా ఇవ్వబోతున్నామన్నారు చంద్రబాబు. ఐఐటీ మద్రాస్‌లో జరుగుతున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్- 2025కు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, బృందం కీలకం కాబోతున్నట్లు వెల్లడించారు. వారితో పాటు ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, కేంద్ర ప్రభుత్వం తదితరులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికతతో పాటు అందరి జీవితాలకు పనికొచ్చే డీప్ టెక్నాలజీల్ని కూడా ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. 1995లో ఐటీ ఎలా మొదలుపెట్టానో, 2025లో ఏఐ గురించి అలాగే ఆలోచిస్తున్నానని చెప్పారు. ఏపీకి వచ్చేందుకు గూగుల్ సుముఖత తెలిపిందని, డాటా సెంటర్‌ను పెడుతున్నట్లు వివరించారు. విశాఖ నుంచి సింగపూర్ దాకా సముద్రగర్భంలో సీ కేబుల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
దక్షిణాదిలో యువత ఆలోచన మారిపోయిందన్నారు చంద్రబాబు. పెళ్లి చేసుకుని, భార్యభర్తలం ఉద్యోగాలు చేసుకుందాం, పిల్లలొద్దు అనుకునే వాళ్లు పెరిగిపోతున్నారని, అలాగైతే జనాభా తగ్గిపోతుందన్నారు. జనాభాను సరైన ప్రకారం పెంచితే రాబోయే 500 సంవత్సరాలు భారతీయులే ప్రపంచాన్ని శాసించే స్థితికి వస్తారాన్నారు.25 ఏళ్ల కిందట జనాభా నియంత్రణ నినాదం తీసుకోవడంతో ఇప్పుడు దక్షిణ భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గిందన్నారు. ఒకప్పుడు జనాభా పెద్ద సమస్యగా ఉండేదని, ఇప్పుడు అదే అతిపెద్ద లాభంగా మారుతోందని గుర్తుచేశారు. పద్ధతి ప్రకారం జనాభా పెంచుకుని 20 కోట్ల మంది భారతీయులు 150 దేశాల్లో విస్తరిస్తే.. ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతుందో ఊహించుకోవాలన్నారు.
ఒకప్పుడు మనల్ని వద్దన్న జపాన్, జర్మనీలు సైతం ఇప్పుడు భారతీయ యువత కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పారు. యువతకు ప్రపంచంలో అతిపెద్ద డిమాండ్ ఉందన్నారు. 2047లో ప్రపంచంలోనే భారత్ పెద్ద కమ్యూనిటీ కాబోతోందన్నారు. కార్పొరేట్, పబ్లిక్ గవర్నెన్స్‌లో యువత గ్లోబల్ లీడర్లుగా మారే అవకాశం ఉందన్నారు. అందులో తెలుగువారు కచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు చంద్రబాబు. మరో పాతికేళ్లపాటు భయం లేకుండా.. దేశంలో 18-29 ఏళ్ల మధ్య ఉన్న పనిచేసే యువత 42 కోట్ల మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. 2028 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో స్థానానికి రావచ్చని అంచనా వేశారు. 2047 నాటికి మొదటి లేదా రెండో స్థానానికి వచ్చే అవకాశాలున్నాయని వివరించారు.
IITM విద్యార్థుల్లో ఎవరైనా స్టార్టప్ పెడుతుంటే వినూత్న ఆలోచనలతో ఏపీకి రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. ఐఐటీ మద్రాస్‌లో 30 శాతం మంది వరకు తెలుగువారే ఉండటం గర్వంగా ఉందన్నారు. నా ఆశ, నమ్మకం మీరేనని, ఆలోచనలకు పదును పెట్టాలని యువతకు సూచించారు రాబోయే రోజుల్లో ఏపీలో తలసరి ఆదాయం రూ.50 లక్షలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. మీరు విదేశాలకు వెళ్లి ఇంతకంటే ఎక్కువ సంపాదించి రాష్ట్రానికి తిరిగిచ్చే స్థాయికి రావాలని కోరారు.
గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు జరిగిన విషయాల్ని చంద్రబాబు ఐఐటీఎం విద్యార్థులతో పంచుకున్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు స్విట్జర్లాండ్ నుంచి ఓ మంత్రి వచ్చారని..స్వతహాగా తాను ఆశావాదినని, ఆచరణాత్మక వ్యక్తినని చెప్పారు. అప్పట్లో నేను హైటెక్‌సిటీ, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలపై దృష్టి పెట్టడం చూసి.. రాజకీయ నేతలు ఇలా మాట్లాడకూడదని ఆయన అన్నారని చెప్పుకొచ్చారు. ఆచరణకు సాధ్యం కానివన్నీ చేస్తున్నాడు..పిచ్చొడని అన్నారని గుర్తు చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత ఆయన ఆ దేశానికి ప్రధాని అయ్యాక దావోస్‌లో కలిసినప్పుడు.. క్షమించమని కోరాడన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.