Jagan Relief Booked Sakshi Media :
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం నాడు బిగ్ రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన బెయిల్ ను బుధవారం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. జగన్ తో పాటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలన్న రఘురామరాజు పిటిషన్ ను కూడా కోర్టు కొట్టేసింది. ఈ తీర్పుతో జగన్ అండ్ కోకు బిగ్ రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. ఎందుకంటే.. సొంత పార్టీ ఎంపీ దాఖలు చేసిన పిటిషన్ తో సీబీఐ కోర్టు ఎక్కడ తన బెయిల్ ను రద్దు చేస్తుందోనన్న భయం జగన్ ను చాలా కాలమే వెంటాడిందని చెప్పక తప్పదు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు రఘురామరాజు పిటిషన్ ను కొట్టేయడంతో జగన్ తో పాటు వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే జగన్ కు దక్కిన ఈ రిలీఫ్.. ఆయన ఫ్యామిలీ నేతృత్వంలోని సాక్షి దినపత్రికను అడ్డంగా బుక్ చేసి పారేసింది. జగన్ కు కోర్టులో రిలీఫ్ దక్కితే.. సాక్షి ప్రతినిధులు ఇప్పుడు కోర్టు మెట్లెక్కారు.
ముందే కూసి.. సారీ చెప్పి..
రఘురామరాజు పిటిషన్లపై గత విచారణలోనే సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరిస్తుందని అంతా అనుకున్నారు. కోర్టు కూడా అదే ప్రకటన చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో తీర్పును ఈ నెల 15కు వాయిదా వేసింది. అయితే ఇదేమీ పట్టించుకోని సాక్షి మీడియా.. గత విచారణ సమయంలో కోర్టు పనివేళలు ప్రారంభం కాకుండానే.. జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట దక్కిందని, జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న రఘురామరాజు పిటిషన్ ను కోర్టు కొట్టేసిందని సాక్షి పత్రిక తన వెబ్ ఎడిషన్ లో వార్తను ప్రచురించేసింది. దీనిపై క్షణాల్లోనే పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలు కావడంతో సాక్షి మీడియా ఆ వార్తను డిలీట్ చేసింది. అయితే అప్పటికే చాలా మంది ఆ వార్తకు చెందిన స్క్రీన్ షాట్ ను తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వెరసి.. కోర్టు తీర్పు వెలువడకముందే పొరపాటున ఆ వార్తను ప్రచురించామని, అందుకు చింతిస్తున్నామని సాక్షి పత్రిక అదే వెబ్ పేజీలో క్షమాపణలు చెప్పింది. అయితే ఈవ్యవహారంపై రఘురామరాజు కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం జరిగిన విచారణకు సాక్షి ఎడిటర్, ఇతర ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
సాక్షి రాసినట్టుగానే కోర్టు తీర్పు..
ఇదిలా ఉంటే.. బుధవారం సాక్షి వెబ్ పేజీలో వచ్చినట్టుగానే సీబీఐ కోర్టు తీర్పు కూడా ఉంది. సాక్షి మీడియా వార్తకు కోర్టు ప్రభావితం కాలేదు గానీ.. బుధవారం వచ్చిన తీర్పును సాక్షి పత్రిక ఓ 15 రోజులు ముందుగానే ఎలా పసిగట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కోర్టు తీర్పును ప్రభావితం చేసేలా సాక్షి మీడియా వార్తలు రాసిందన్న ఆరోపణలకూ బలం చేకూరింది. ఈ నేపథ్యంలో సాక్షి మీడియాపై రఘురామ ఫిర్యాదును సీబీఐ కోర్టు బుధవారం నాడు ఏకంగా తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. వెరసి జగన్ కు బెయిల్ దక్కిన ఆనందం సాక్షి మీడియాలో కనిపించలేదు. ఎందుకంటే.. తమ నేతకు రిలీఫ్ దక్కితే.. తాము బుక్కైపోయాం కదా అన్న బాధ ఆ పత్రిక ప్రతినిధులను వేధిస్తోందట.
Must Read ;- బుక్ చేస్తున్నారా?.. రక్షిస్తున్నారా?











