ఏపీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ రాష్ట్ర పోలీసుల తీరు ఒక్కసారిగా మారిపోయింది. చట్టాలంటే లెక్క లేదు.. వాస్తవాలతో పని లేదు.. వైసీపీ నేతలు ఎంత చెబితే అంతే.. వారు ఏది చెబితే అదే కరెక్ట్.. వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడినా పట్టించుకోరు.. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తారు. వైసీపీ కార్యక్రమాలకు దగ్గరుండి మరీ భద్రత కల్పిస్తారు.. అదే ఇతర పార్టీల కార్యక్రమాలైతే అసలు అనుమతులే ఇవ్వరు.. ఇలా ఏపీ పోలీసులు జగన్ జమానాలో తమదైన కొత్త చట్టాలను అమలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మాట నిజమేనన్నట్టుగా గురువారం నాడు విజయవాడలో ఏకంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డినే ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. కిషన్ రెడ్డి రాక సందర్భంగా బీజేపీ శ్రేణులు నిర్వహించతలపెట్టిన ర్యాలీని అడ్డుకున్నారు. బీజేపీ శ్రేణుల వాగ్వాదం తర్వాత కేంద్ర మంత్రితో పాటు ఆయన ఎస్కార్ట్ వాహనాన్ని మాత్రమే నగరంలోకి అనుమతించారు. ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు ఏపీ పోలీసుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
కేంద్ర కేబినెట్ పునర్వవస్థీకరణ నేపథ్యంలో కేంద్ర మంత్రులంతా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లాలని, తమ నియోజకర్గాలకు సమీపంలోని కనీసం మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించాలని, ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. జన ఆశీర్వాద యాత్రల పేరిట జరుగుతున్న ఈ కార్యక్రమాలను తెలుగు నేలకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలుత తిరుపతిలో పర్యటించిన కిషన్ రెడ్డి గురువారం నాడు విజయవాడకు వచ్చారు. తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కిషన్ రెడ్డి అక్కడి నుంచి విజయవాడకు ర్యాలీగా బయల్దేరారు. అయితే బెజవాడలోకి ఎంట్రీ పాయింట్ గా ఉన్న ఎనికేపాడు వద్ద ర్యాలీని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా పోలీసులు ఏమాత్రం తగ్గలేదు. కేవలం రెండు కార్లను మాత్రమే విజయవాడ వైపుకు అనుమతించారు.
జగన్ సర్కారు తీరుపై నిప్పులు
పోలీసులు తన పార్టీ శ్రేణులను అడ్డుకున్నా.. ఓపిక పట్టిన కిషన్ రెడ్డి ఆ తర్వాత విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాత్రం జగన్ సర్కారుపై విమర్శలు చేశారు.ఏపీ ప్రభుత్వం బీజేపీ శ్రేణులను వేధిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. పార్లమెంటులో పని చేయనీయకుండా తమను అడ్డుకున్నారని ఆరోపించారు. అందుకే ప్రజల్లోకి వచ్చి జన ఆశీర్వాద యాత్ర చేపట్టామని వివరించారు. అనేక అంశాల్లో ఏపీకి ప్రాధాన్యత కింద నిధులు ఇచ్చామని వెల్లడించారు. ఏపీకి నిధుల విషయంలో కేంద్రంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసంతృప్తి వెలిబుచ్చారు. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మవద్దని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలకు వ్యక్తిగత స్వార్థం తప్ప విశాల దృక్పథం ఉండదని విమర్శించారు. మొత్తంగా జగన్ కేంద్రంగానే కిషన్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని రీతిలో విమర్శలు సంధించారు.
Must Read ;- జగన్ కోర్టు మెట్లెక్కాల్సిందేనా?











