The CBI Court Has Adjourned Its Decision On Jagan’s Bail Revocation Petition :
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో బుధవారం ఉదయం నుంచి ఒకటే టెన్షన్ కనిపించింది. తమ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ ఎక్కడ రద్దు అవుతుందో, ఎక్కడ ఆయన జైలుకు వెళతారో, వైసీపీ ఏమవుతుందోనన్న బెంగ ఆ పార్టీ నేతలను హైరానా పెట్టేసింది. కోర్టు తీర్పు మధ్యాహ్నం వరకు కూడా రాలేదు. అయితే జగన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని సాక్షి పత్రిక మాత్రం వైసీపీ నేతల కంటే కూడా హైరానా పడిపోయింది. ఆ హైరానాలో తాను ఏం చేస్తున్నానో కూడా ఆ పత్రిక పట్టించుకోలేదు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసిందంటూ సంచలన వార్తను తన సోషల్ మీడియా విభాగంలో పోస్ట్ చేసింది. అంటే.. ముందే కూసిన కోయిల మాదిరి అన్న మాట.
ట్రోలింగ్ తో సతమతం
అయితే కోర్టు ఇంకా తీర్పు వెలువరించకుండానే.. కోర్టు తీర్పు ఇచ్చినట్టుగా, జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసినట్లుగా సాక్షి లో వార్త కనిపించగానే.. కొందరు నమ్మేశారు. మరికొందరు కోర్టు విధులు మొదలైన వెంటనే ఈ తీర్పు వచ్చినా.. ఆ వార్త బయటకు రావడానికి కనీసం గంటైనా పడుతుంది కదా.. మరి సాక్షికి 10.30 గంటలకే ఎలా తెలిసిందన్న కోణంలో ఆలోచన చేసిన కొందరు అసలు వాస్తవం తెలుసుకుని ఆగ్రహానికి గురయ్యారు. అసలు కోర్టు తీర్పు చెప్పకుండానే.. తీర్పు వెలువడినట్లుగా సాక్షి చెప్పిందని తేల్చేశారు. అంతే.. సాక్షిపై సోషల్ మీడియా వేదికగా సెటైర్ల వర్షం మొదలైంది. దీంతో తన తప్పు బయటపడిపోయిందని భావించిన సాక్షి..తన తప్పును అంగీకరిస్తూ.. పొరపాటు జరిగిందని క్షమాపణలు చెబుతూ మరో పోస్ట్ పెట్టింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.
అసలు తీర్పే రాలేదు
ఇక బుధవారం మధ్యాహ్నం ఈ వ్యవహారంలో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తన తీర్పును వచ్చే నెల 15న వెల్లడిస్తామని వెల్లడించింది. వాస్తవానికి మునుపటి వాయిదా సందర్భంగా ఈ నెల 25న ఈ వ్యవహారంపై తుది తీర్పు వెల్లడిస్తానని కోర్టు చెప్పినా.. కారణాలేమిటో అంతగా తెలియరాలేదు గానీ.. తన తుది తీర్పును వచ్చే నెల 15న వెల్లడించనున్నట్లుగా కోర్టు చెప్పింది. ఈ మాట వినిపించినంతనే.. సాక్షి మీడియాపై నెటిజన్లు మరింత మేర ఘాటు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
Must Read ;- జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాగ్రహంతోనైనా సీబీఐ మారాలి