తెలంగాణలో ఆదివారం రాజకీయంగా ఒకే ఇక ఇంటర్వ్యూ చర్చనీయాంశమైంది. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ 10టీవీలో ప్రసారం కావడమే ఆ చర్చకు కారణం. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఏ ABNలోనో, V6లోనో, RAJ NEWSలోనో, NTVలో, TV5లో, ETVలో ప్రసారం అయితే ఇంత చర్చ జరిగేది కాదు. కాని రేవంత్‌రెడ్డిని కొన్నాళ్లుగా టార్గెట్ చేసి మరీ విమర్శలు చేస్తున్నారని రేవంత్ అభిమానులు చెబుతున్న గ్రూపు టీవీల్లో ఒకటైన10tvలో ఇంటర్వ్యూ రావడంతోనే ఈ చర్చ జరుగుతోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేక గ్రూపు టీవీల్లోని ముఖ్యులే ఈ టీవీలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ గురించి పాజిటీవ్ వార్తలు, కథనాలు ఈ టీవీలో వస్తాయనుకోవడం కొంత అత్యాశే అవుతుందన్న ఒపీనియన్ ఉన్న నేపథ్యంలో ఏకంగా రేవంత్ ఇంటర్వ్యూ అదీ పాజిటీవ్ యాంగిల్‌లో ప్రైమ్ టైం, సండే రోజున ప్రసారం కావడంతో రేవంత్ అభిమానులూ ఒకింత షాక్ తిన్నారని చెప్పవచ్చు. ఈ విషయంలో చాలామందిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ టీవీల్లో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారని చెబుతున్న జూపల్లి రామేశ్వరరావును టార్గెట్ చేసి రేవంత్‌రెడ్డి ఎప్పటి నుంచో కామెంట్లు చేస్తున్నారు. కొంత కాలం క్రితం రూ.కోటి.12లక్షలతో ఏసీబీకి ఓ రెవెన్యూ ఉద్యోగి పట్టుబడిన సమయంలో ఆ డబ్బు రేవంత్‌కి సంబంధించిన వారిదే అనే కోణంలో ఆ టీవీల్లో ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన రేవంత్‌రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న టీపీసీసీ రేసులో రేవంత్‌రెడ్డి పేరు వచ్చాక కూడా.. సదరు టీవీల్లో ప్రత్యేక కథనాలు వచ్చాయి. దీంతో రేవంత్ వర్సెస్ ఆ గ్రూపు టీవీలు అన్న పరిస్థితి కనిపించింది.
ఆయన టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు..
అంతేకాదు… ఇటు కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి, అటు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లు రామేశ్వరరావు టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాను గతంలో ఆ గ్రూపులో ఉద్యోగం చేశానని చెబుతూనే అర్వింద్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో రాజ్ న్యూస్‌లో రామేశ్వరరావు టార్గెట్‌గా కథనాలూ వస్తున్నాయి. వాటి విషయంలో రామేశ్వరరావు, మైహోం గ్రూపు పరువు నష్టం దావాలు వేసినట్లు కూడా తెలుస్తోంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో అనూహ్యంగా ఆదివారం రేవంత్ రెడ్డి ఇంటర్య్యూ ప్రసారం కావడం ఏంటనే చర్చ మొదలైంది. టీవీ ఛానెల్‌పై వన్ సైడ్ అనే ఒపినియన్ రాకుండా బ్యాలెన్స్ చేయడమా లేక రాజకీయ పరమైన కారణాలా అనే చర్చ మొదలైంది. అంతేకాదు.. ఇలాంటి ఇంటర్వ్యూలు గ్రూపు పరిధిలో ఉన్న మరో ఛానెల్‌లో కూడా త్వరలో రానుందన్న చర్చ నడుస్తోంది.
ఆధ్యాతిక కార్యక్రమాలు ఎక్కువగా చేసే వ్యక్తిగా..
ఇక్కడే మరో విషయం కూడా ఉంది. మైహోం గ్రూపు అధినేత రామేశ్వరరావు ఆధ్యాతిక కార్యక్రమాలు ఎక్కువగా చేసే వ్యక్తిగా పేరుంది. యాగాలు, హోమాల్లాంటి కార్యక్రమాలు చేయడంతోపాటు చినజీయర్ స్వామిలాంటి ఆధ్యాత్మిక వ్యక్తులతో పరిచయాలున్నాయని ప్రచారంలో ఉంది. యాగాలు, పూజలు కూడా చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి. అలాంటి ఆధ్యాత్మిక వ్యక్తులు, ఆధ్యాత్మిక ప్రముఖులకు బీజేపీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో రామేశ్వరరావుకు బీజేపీ నుంచి పదవులకు సంబంధించి ప్రతిపాదన వచ్చిందని సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది. అందులో భాగంగానే ఆగ్రూపు పరిధిలో ఉన్న మీడియాలోనూ అన్ని పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం చేయాలన్న నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మాత్రమే.
మరోవైపు ఇటీవల కేసీఆర్ ఢిల్లీ టూర్ తరువాత బీజేపీతో వివాదం కంటే సఖ్యతే మేలనే అభిప్రాయం వచ్చిందని, బీజేపీకి దగ్గర కావాలంటే.. తొలుత క్షేత్రస్థాయిలో ప్రధానమైన ప్రత్యర్థుల నుంచి వస్తున్న ఆరోపణలు తగ్గించుకోవాలనే ఉద్దేశం కూడా ఉండవచ్చని కొన్ని వెబ్ సైట్లలో వార్తలు వస్తున్నాయి. వీటిల్లో ఏది నిజం..ఏది ప్రచారం అనేది రానున్న కాలంలో రాజకీయ సమీకరణాలను బట్టి తేలనుంది.