వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన వరుస లేఖల్లో భాగంగా ఆదివారం సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు. ఈ లేఖలో ఏపీ రాజధాని అమరావతి, దాని ప్రస్తుత స్థితి, దానిపై జనానికి జగన్ ఇచ్చిన హామీ, ప్రస్తుతం జరుగుతున్నదేంటీ? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? తక్షణమే చేయాల్సిందేమిటి? అన్న విషయాలను ప్రస్తావించిన రఘురామరాజు… చాలా అంశాలనే ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వచ్చినా… అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగిస్తానని జగన్ చెప్పిన అంశాన్ని ఈ సందర్భంగా రఘురామరాజు గుర్తు చేశారు. మాట తప్పం… మడమ తిప్పం అనే మాట మేరకే నడుచుకోవాలని, మాట తప్పొద్దు, మడమ తిప్పొద్దు అంటూ జగన్ కు రఘురామరాజు సూచించారు.
తాడేపల్లి ఇల్లుతో నమ్మకం కలిగించాం కదా
తాజా లేఖలో రఘురామరాజు ప్రస్తావించిన అంశాల విషయానికి వస్తే… రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు చేస్తున్న నిరసనలు 550 రోజులు పూర్తి చేసుకున్న విషయాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయినా చంద్రబాబు సర్కారు ఎంపిక చేసినప్పటికీ అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగిస్తామని వైసీపీ హామీ ఇచ్చింది కదా అని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని పాదయాత్రలో భాగంగా పలుమార్లు జగన్ ప్రస్తావించిన అంశాన్ని కూడా గుర్తు చేశారు. అంతేకాకుండా రాజధానిని ఎక్కడికీ తరలించేది లేదన్నట్లుగా ప్రజల్లో ఓ నమ్మకం కలిగించేలా తాడేపల్లిలోనే జగన్ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న వైనాన్ని రఘురామరాజు ప్రస్తావించారు. ఈ చర్యతో అమరావతి రైతులనే కాకుండా యావత్తు రాష్ట్ర ప్రజలకు అమరావతే రాష్ట్రానికి శాశ్వత రాజధాని అన్న నమ్మకాన్ని కలిగించారు కదా అని కూడా ఆయన జగన్ కు గుర్తు చేశారు.
ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం ఏం కావాలి?
అలాంటిది ఇప్పుడు అమరావతిని కేవలం శాసన రాజధానికి పరిమితం చేసేసి మూడు రాజధానుల మాటను ఎత్తుకుంటే… మన పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏం కావాలని రఘురామరాజు ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల మన పార్టీపై జనాల్లో విశ్వాసం ఎలా ఉంటుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కరోనా, లోటు బడ్జెట్ పరిస్థితుల నేపథ్యంలో మూడు రాజధానుల నిర్మాణానికి ఆర్థిక వనరులను ఎలా సమకూరుస్తారని జగన్ ను ప్రశ్నించారు. ఇప్పటికే ఓ రేంజిలో అభివృద్ధి అయిన విశాఖను రాజధాని పేరిట ఇంకేం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మొత్తంగా ఎన్నికలకు ముందు మన పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి బదులుగా వాటి నుంచి మనం తప్పుకుంటున్నట్లుగా ప్రజలకు సంకేతాలు వెళుతున్నాయని… ఇలాంటి నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం కలిగిన పార్టీ అధినేతగా నిలవాలంటే… మాట తప్పకుండా, మడమ తిప్పకుండా సాగాల్సిందేనని జగన్ కు రఘురామరాజు సూచించారు.
Must Read ;- రాజు గారి టార్గెట్ గా సాయిరెడ్డి.. ఇక దబిడిదిబిడే!











