అమరావతి రాజధాని బోరుమంటోంది. గత ప్రభుత్వ హయాంలో రూ.పది వేల కోట్ల ఖర్చుతో అమరావతిలో పలు భవనాలు, రోడ్లు డ్రైనేజీలు నిర్మించారు. కొన్ని భవనాలు 90 శాతం పూర్తి కాగా, మరొకొన్ని 70 శాతం పూర్తయ్యాయి. ఇక మౌలిక సదుపాయాల కోసం గత ప్రభుత్వం దాదాపు రూ.7,000కోట్లు ఖర్చు చేసింది. 2019 ఎన్నికల తరవాత ప్రభుత్వం మారింది. వారి ప్రాధామ్యాలు కూడా మారాయి. మూడు రాజధానులను తెర మీదకు తెచ్చారు. అమరావతిని చంపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అమరావతిలో గడచిన రెండేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి ఖర్చు చేయలేదు. దీంతో గత ప్రభుత్వం ఖర్చు చేసి నిర్మించిన భవనాలు శిథిలమై పోతున్నాయి. అసంపూర్తిగా వదిలేసిన రోడ్లపై కంప చెట్లు మొలిచాయి. అమరావతిలో ఒక్క హైకోర్టు, వెలగపూడి సచివాలయం మినహా మిగిలిన భవనాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. దీంతో భవనాల్లో ఏర్పాటు చేసిన ఏసీలు, ఫర్నిచర్ తుప్పుపట్టిపోతున్నాయి.
ప్రజల సొమ్ముకు భద్రత లేదా?
ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బుతో అమరావతిలో రూ.10,000 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వం మారిన కొద్ది కాలానికే మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీంతో అమరావతి రాజధానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే ఇక ఏపీకి శాశ్వత రాజధాని అనేది లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అమరావతిలో కేవలం రూ.300 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు పది లక్షల చదరపు అడుగుల భవనాలు అందుబాటులోకి వస్తాయి. అనేక కార్యాలయాలు పెట్టుకోవచ్చు. ఎమ్మెల్యేలు, అధికారులకు నివాసాలు కేటాయించ వచ్చు. కానీ ప్రభుత్వ ఆలోచన వేరుగా ఉంది. అమరావతి రాజధానిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే ఆలోచన లేదు. అమరావతి రాజధానిని లెజిస్లేటివ్ రాజధానిగా ప్రకటించారు. అంటే అసెంబ్లీ, శాసనమండలి మాత్రమే ఇక్కడ మిగిలే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టును కర్నూలుకు తరలించాలని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిషాను కోరారు. కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ ఇస్తే హైకోర్టు తరలిపోతుంది. ఇక సచివాలయాన్ని విశాఖ తరలించేందుకు ఏడాదిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కోర్టు కేసుల కారణం వేచి చూస్తున్నారు. ఇక కేసులతో సంబంధం లేకుండా సీఎం ఎక్కడ నుంచైనా పాలన సాగించవచ్చని మంత్రులు కొత్త రాగం అందుకున్నారు. అంటే కోర్టుల్లో కేసులు ఇప్పట్లో తేలాలా లేవని, పాలనా రాజధానిని అనధికారికంగా విశాఖ తరలించాలని వైసీపీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- 3 రాజధానులపై ముందుకే.. మంత్రి బొత్స,ఎంపీ విజయసాయిరెడ్డి
రాజధాని రైతులు గగ్గోలు
అమరావతి రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆరేళ్లుగా పంటలు లేవు, ప్రభుత్వం నుంచి సక్రమంగా కౌలు కూడా అందడం లేదు. ఇక అమరావతి రాజధానిని చంపేశారు. ఇక్కడ అభివృద్ధి ఎప్పుడో నిలిచిపోయింది. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు అమ్ముకోవాలన్నా కొనేవారు లేదు. దీంతో 29 గ్రామాల రైతులు ఏం చేయాలో అర్థం కాక ఇప్పటికే 139 మంది ప్రాణాలు కోల్పోయారు. మనోవేధనలో వేలాది మంది జీవితాలను సాగిస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు పూర్తి చేయాలన్న ఆలోచన చేయడం లేదు. దీంతో నిటారుగా 12 అంతస్థులు లేచిన భవనాలను పట్టించుకోకపోవడంతో కంపచెట్లు మొలచిపోతున్నాయి. ఈ భవనాలు భూత్ బంగళాలను తలపిస్తున్నాయి.
అమరావతి భవనాల తాకట్టు పెడతామంటే..
అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను తాకట్టు పెట్టి వాటిని పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం ఏడాది కిందట భావించింది. అయితే అప్పులు ఇచ్చేందుకు ఒక్క బ్యాంకు కూడా ముందుకు రాకపోవడంతో పనులు మొదలు కాకుండానే ఆ ఆలోచన విరమించుకున్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేస్తామని పురపాలక మంత్రి బొత్స ప్రకటించారు. కానీ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా అమరావతి రాజధానికి కేటాయించలేదు. కనీసం 90 శాతం పూర్తయిన భవనాలను అయినా ఉపయోగించుకోవాలన్న ఆలోచన చేయడం లేదు. ఎంత సేపటికీ అమరావతి ఓ సామాజిక వర్గ రాజధాని అని ఒకరు, ఇది శ్మశానంలా ఉందని మరొకరు, ఎడారిని తలపిస్తోందని మరో మంత్రి ఇలా అమరావతి రాజధానిని చంపే ప్రయత్నం చేశారే కాని ఒక్కరు కూడా అమరావతికి ప్రాణం పోయాలని ఈ ప్రభుత్వంలో తపించే వారే లేరు. అందుకే అమరావతి రాజధాని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది.
Must Read ;- 90 నిమిషాల భేటీ.. మూడు రాజధానులు,బకాయిలు ఇప్పించాలంటూ










