వారనుకున్నట్లే చేసుకోగలుగుతున్నారు. పట్టుబట్టి పంతం కొద్దీ వెళ్లాలనుకున్న విశాఖకు వెళుతున్నారు. అయితే అధికారికంగా కాదు..అనధికారికంగా. క్యాంప్ ఆఫీసు పేరుతో సీఎం ఆఫీసు విశాఖలో పరిపాలన సాగించనున్నది. వైసీపీ వారు అనుకున్నట్లు అన్నీ జరిగితే జూలైలోనే వారి కోరిక నెరవేర్చుకోనున్నారు. మొన్నటి వరకు విజయసాయిరెడ్డి ట్వీట్లు.. ఆ తర్వాత మంత్రి బొత్స స్టేట్‌మెంట్లు.. కాని ఈసారి ఏకంగా హోంమంత్రి అమిత్ షాతో భేటీలోనే ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అందుకే వైసీపీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో విశాఖ నుంచి పరిపాలనను మొదలెట్టడానికి రెడీ అవుతున్నారు.
సీఎం క్యాంప్ ఆఫీసుకు అవకాశం
కోర్టు ఆదేశాల ప్రకారం రాజధానిని తరలించలేరు. అమరావతి రైతులు, మరికొందరు వేసిన పిటిషన్లపై విచారిస్తున్న హైకోర్టు తుది ఆదేశాలు ఇచ్చేవరకూ ఆ పని చేయలేరు. అందుకే తెలివిగా క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నారు. సీఎం ఎక్కడైనా క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేసుకోవచ్చు..సీఎంకున్న అధికారాలను బట్టి.. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా సమావేశాలు పెట్టుకోవచ్చు.. అధికారులను పిలిపించుకోవచ్చు..ఒక్క ఆఫీసులు మాత్రం పెట్టించలేరు అంతే. మిగతావన్నీ చేసుకోగలరు. ఇప్పుడు అదే ప్లాన్ అమలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు సచివాలయానికి వెళ్లకుండా కేవలం తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచే పరిపాలన చేస్తున్నట్లే చేస్తారు. ఈ పని ఎప్పుడో చేద్దామనుకున్నా.. కేవలం కేంద్రంలోని బిజెపి నుంచి గ్రీన్ సిగ్నల్ కోసమే వెయిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో కేంద్రాన్ని కాదని ముందుకు వెళితే తేడాలొస్తాయి కాబట్టి.. జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు అర్ధమవుతోంది.
జూలైలో మంచి మూహూర్తం చూసుకుని..
జూలైలో మంచి మూహూర్తం చూసుకుని తామనుకున్న షిఫ్టింగ్‌ను అనధికారికంగా చేయనున్నారు జగన్మోహన్‌రెడ్డి. అమరావతిలో సచివాలయం అలాగే ఉంటుంది.. సీఎం ఆఫీసు అలాగే ఉంటుంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు అలాగే ఉంటుంది. జగన్ మాత్రం విశాఖలో ఉంటారు.. అధికారులూ అక్కడే ఉంటారు. ఫైల్స్ అన్నీ ఆన్ లైనే కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు. దీంతో పాటు వీరు కోరినట్లు కేంద్రం కర్నూలు హైకోర్టు ఏర్పాటుకు కూడా రీ నోటిఫికేషన్ ఇచ్చిందంటే.. ఇక తిరుగుండదు.
ఇకపోతే అంతా హైకోర్టులో జరిగే విచారణపైనే ఆధారపడి ఉంటుంది. ఆయా కేసుల్లో హైకోర్టు ఇచ్చే తుది ఆదేశాలను బట్టే రాజధానుల భవితవ్యం తేలనున్నది. అయితే విశాఖలో జగన్ క్యాంప్ ఆఫీసు ఏర్పాటుపై హైకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యే అవకాశం కనపడుతోంది. అప్పుడు హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్నదే కీలకం కానున్నది.
Must Read ;- తాడేపల్లి నుంచి జగన్ శాసిస్తే.. ఢిల్లీలో మోదీ పాటిస్తున్నారంట!











