వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎవరిని టార్గెట్ చేసినా మామూలుగా ఉండదనే చెప్పాలి. పార్టీ అధినేత, ఏకంగా సీఎం సీటులో కూర్చున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేయడంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా రఘురామరాజు సాగిన తీరు నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు రఘురామరాజు టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందన్నది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో రాజు గారి టార్గెట్ గా వైసీపీలో కీలక నేతగా, జగన్ తర్వాత స్థానం తనదేనని కలరింగ్ ఇస్తున్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి మారిపోయారు. పార్టీ అధినేత జగనే… రఘురామ దెబ్బకు గిలగిల్లాడిపోతే… ఇక సాయిరెడ్డి పరిస్థితి ఎలా ఉండనుందో ఇట్టే ఊహించుకోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అంతా సాయిరెడ్ది గురించే
గడచిన పది రోజులుగా వరుసగా సీఎం జగన్ కు లేఖాస్త్రాలు సంధిస్తూ వస్తున్న రఘురామరాజు… శనివారం కూడా ఓ లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ లేఖలో జనానికి పార్టీ తరఫున ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలన్న విషయాన్ని గుర్తు చేసిన రఘురామరాజు… లేఖలో మెజారిటీ భాగాన్ని సాయిరెడ్డిని టార్గెట్ చేసేందుకే వినియోగించారు. సాయిరెడ్డి తీరుతో పార్టీ పరువు గంగలో కలుస్తోందని, సాయిరెడ్డిని నియంత్రించకపోతే… 2014లో పార్టీకి ఎదుదైన ఫలితాలే 2024లో కూడా ఎదురు కాక తప్పదని కూడా రఘురామరాజు జోస్యం చెప్పారు. అంతేకాకుండా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై సాయిరెడ్డి విమర్శలు సంధించిన తీరుపై రఘురామరాజు తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదుపులో పెట్టకపోతే కష్టమే
సాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ జగన్ కు రాసిన లేఖలో రఘురామరాజు ఏమని ప్రస్తావించారన్న విషయానికి వస్తే… *అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయిరెడ్డి అనవసరంగా నోరు పారేసుకొంటున్నారు. ఆయనను వెంటనే అదుపు చేయాలి. అశోక్‌గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు. మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు సైతం ఇచ్చింది. ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి అశోక్‌గజపతిరాజుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వెంటనే అదుపులో పెట్టాలి. అశోక్ గజపతి పైన సాయిరెడ్డితో పాటుగా పలువురు వైసీపీ నేతలు సైతం తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వారిని నియంత్రించాలి. విజయసాయిరెడ్డిని, మంత్రులను పార్టీ భవిష్యత్ కోసం నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర ప్రజల్లో దాగున్న భావోద్వేగం వెల్లువెత్తి 2014 పరిస్థితులు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా* అంటూ రఘురామరాజు సాయిరెడ్డినే ప్రధానంగా టార్గెట్ చేస్తూ లేఖను రాశారు.
Must Read ;- మాన్సాస్ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు.. ఏపీ సర్కారుకు స్ట్రాంగ్ కౌంటర్










