కేవలం ఐదేళ్ళలోనే దక్షిణాదిన టాప్ హీరోయిన్ అయిపోయింది తమిళ పొణ్ణు సాయిపల్లవి. అంత అందగత్తె కాకపోయినా, తన పెర్ఫార్మెన్స్ పవర్ తో ఇతర కథానాయికలకు గట్టి పోటీగా మారింది. ‘ఫిదా, యం.సీ.ఏ, పడిపడిలేచె మనసు’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. ప్రస్తుతం నాగచైతన్య తో ‘లవ్ స్టోరీ’ మూవీలో నటిస్తోంది. శేఖర్ కమ్మల దర్శకత్వంలో రౌడీ బేబీ రెండోసారి తన పెర్ఫార్మెన్స్ తో మాయ చేయబోతోంది. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో చాలా సినిమాలున్నాయి. అన్నిటిలోనూ అమ్మడు హీరోయిన్ గానే నటిస్తోంది . అయితే త్వరలో ఒక సినిమాలో సాయి .. చెల్లెలి పాత్ర పోషించబోతోందట. అది కూడా మెగాస్టార్ చిరంజీవికి. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో వైరల్ అవుతోంది.
అన్నయ్యకు చెల్లంటా… మదినిండా సంబరమంటా…
ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న చిరంజీవి… ఇది విడుదలయ్యే టైమ్ కి మరికొన్ని సినిమాల్ని ట్రాక్ లో పెట్టబోతున్నారు. అందులో తమిళ సినిమా ‘వేదాళం’ రీమేక్ ఒకటి. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాని శివ తెరకెక్కించాడు. ఇందులో అజిత్ చెల్లెలిగా మలయాళ నటీమణి లక్ష్మీ మీనన్ నటించింది. తన చెల్లెలు కాకపోయినప్పటికీ .. తనని అన్నా అని ఆప్యాయంగా పిలిచిన ఒక అమ్మాయి ప్రేమ కోసం, ఆమె ప్రొటెక్షన్ కోసం తపించే ఒక పేరు మోసిన రౌడీ కథ ‘వేదాళం’.
పక్కా మాస్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అజిత్ రెండు డిఫరెంట్ కేరక్టర్స్ చేశాడు. ఈ పాత్ర చిరంజీవికి చాలా బాగుంటుందని మెహర్ రమేశ్ కు అనిపించిందట. కథ బాగుండడంతో చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక ఇందులో చిరంజీవి పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో.. చెల్లెలి పాత్ర కు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. అందుకే చెల్లెలిగా ఓ క్రేజీ హీరోయిన్ ను తీసుకుంటే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించారట. అందుకే సీన్ లోకి సాయిపల్లవి వచ్చింది. ఆమెకు కూడా చిరు చెల్లెలిగా నటించడం ఆసక్తిగా ఉందట. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమా కు సంబంధించిన అనౌన్స్ మెంట్ అతి త్వరలోనే రానుందట.
కొంతకాలంగా డైరెక్టర్ గా యాక్టివ్ గా లేని మెహర్ రమేశ్ .. విజయాల పరంగానూ బ్యాడ్ ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలో మళ్ళీ మెహర్ రమేశ్ సినిమా అనగానే ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. పైగా మెగాస్టార్ తో సినిమా అనేసరికి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంత నెగెటివిటీ మధ్య కూడా .. సాయిపల్లవి చెల్లెలు అనగానే.. మళ్ళీ హోప్ కలుగుతోంది. ఫిదాతో మొట్టమొదటిసారిగా మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన సాయిపల్లవి .. ఇప్పుడు చిరు చెల్లెలిగా రెండోసారి ఎంటర్ అవుతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి చిరు, సాయిపల్లవి మ్యాజిక్ తో ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.