తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు భారీ జల యుద్ధమే నడుస్తోంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని భారీగా విస్తరిస్తున్న ఏపీ సీఎం జగన్.. దానికి కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. తమకు కృష్ణా జలాల్లో సగం వాటా కావాల్సిందేనని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. మొత్తంగా ఈ వ్యవహారంపై ఇప్పుడు రెండు రాష్ట్రాలు తీవ్రంగానే పోట్లాడుకుంటున్నాయి. అయితే ఈ పోట్లాట బయటకు కనిపిస్తున్నా.. జగన్, కేసీఆర్ ఇద్దరూ కలిసే సాగుతున్నారని, ఒకరికి మరొకరు సాయం చేసుకుంటూనే ఉన్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మాట నిజమేనన్నట్లుగా ఇప్పుడు కేసీఆర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఇటు కేసీఆర్ గానీ, అటు కేసీఆర్ మంత్రులు గానీ చెప్పలేదు గానీ.. కేసీఆర్ తీసుకున్న స్టెప్ చూస్తుంటే.. జగన్ కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారనే చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా తెలంగాణకు తెలంగాణ భవన్ నిర్మించుకునేందుకు స్థలాన్ని కేటాయించాలని కేసీఆర్.. ప్రధాని మోదీని కోరారు. శుక్రవారం నాటి భేటీలో కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఏపీ భవన్ ను వదులుకున్నట్టేగా
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వానికి కొత్తగా తెలంగాణ భవన్ ఏర్పాటు కావాల్సి ఉందని, దానికి అనుగుణంగానే మోదీని కేసీఆర్ స్తలం అడిగారని ఈ మాట చెబుతోంది. మరి తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన సమయంలో ఉమ్మడి ఏపీ ఆస్తిగా ఉన్న ఏపీ భవన్ లో తమకూ వాటా కావాలని అరిచి గీపెట్టి మరీ కేసీఆర్ ఏపీ భవన్ లో వాటా సాధించుకున్నారు కదా. ఢిల్లీలో ఏపీ సర్కారు ఆస్తిగా మారిన ఏపీ భవన్ స్తలాన్ని నిజాం నవాడు ఇచ్చారని, అది తెలంగాణ ఆస్తేనని, అయితే ఉమ్మడిగా ఉండి విడిపోతున్న నేపథ్యంలోనే ఏపీకి వాటా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నామని కూడా కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే కదా. మరి ఏపీ భవన్ లోనే వాటా తీసుకుని దానినే తెలంగాణ భవన్ గా వాడుకుంటూ ఉంటే.. ఇప్పుడు కొత్తగా తెలంగాణ భవన్ కోసం స్తలం అడిగే అవకాశం ఉండదు కదా. అంటే.. ఇప్పుడు కొత్తగా తెలంగాణ భవన్ కు ఢిల్లీలో కేసీఆర్ స్తలం అడిగారంటే.. ఏపీ భవన్ ను పూర్తిగా ఏపీకే కేసీఆర్ వదిలేసేందుకు సిద్ధమైనట్టే కదా. అంటే.. జగన్ కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టే కదా.
జగన్ ఏమిచ్చారంటే..?
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీకి కనీసం రాజధాని కూడా లేకుండానే కొత్తగా 13 జిల్లాలతో పయనం ప్రారంభించాల్సి వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ ను రెండు రాష్ట్రాల రాజధానిగా పదేళ్ల పాటు కొనసాగించనున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. అంటే.. ఏపీ పాలన హైదరాబాద్ నుంచే పదేళ్ల పాటు సాగాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్ లోని సచివాలయంలో కొన్ని భవనాలు తెలంగాణకు, మరికొన్ని భవనాలు ఏపీకి కేటాయించారు. కొన్నాళ్ల పాటు నవ్యాంధ్ర సీఎం హోదాలో చంద్రబాబు హైదరాబాద్ నుంచే పాలన సాగించారు. అయితే ఆ తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన చంద్రబాబు.. ఏపీ పాలనను అమరావతికి షిప్ట్ చేశారు. అయితే హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో ఏపీకి కేటాయించిన భవనాలను మాత్రం చంద్రబాబు తెలంగాణకు అప్పగించలేదు. ఈ భవనాలు ఎప్పుడు వెనక్కొస్తాయా? ఎప్పుడు ఆ భవనాలను కూల్చేసి కొత్త సచివాలయం కడదామా? అన్నట్లుగా ఎదురు చూస్తున్న కేసీఆర్‌కు.. తాను ఏపీ సీఎం కాగానే జగన్ ఆభవనాలను అప్పగించేశారు. ఆ వెంటనే కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణాన్ని మొదలుపెట్టేశారు. మరి సచివాలయ భవనాలను గడువు తీరకముందే తనకిచ్చేసిన జగన్ కు కేసీఆర్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఆ దిశగానే ఇప్పుడు ఢిల్లీలోని ఏపీ భవన్ ను పూర్తిగా ఏపీకే వదిలేసి కొత్తగా తెలంగాణ భవన్ కు స్తలం కావాలంటూ కేసీఆర్ కేంద్రాన్ని కోరుతున్నారు.
Must Read ;- బాబు పోయి జగన్ వచ్చే!.. టాప్ 4 పోయి 13 వచ్చే!