Nara Lokesh Has Started A Fight Over Cuttings In Old Age Pensions :
ఏపీలోని వైఎస్ జగన్ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ సాగిస్తున్న పోరు సత్ఫలితాలనే సాధించింది. కరోనా నేపథ్యంలో టెన్త్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భద్రత దృష్ట్యా పరీక్షలను రద్దు చేయాలంటూ నారా లోకేశ్ తనదైన శైలి పోరు సాగించిన సంగతి తెలిసిందే. రోజుల తరబడి సాగిన ఈ పోరుపై ఆయా వర్గాల నుంచి భిన్న వాదనలు వినిపించినా.. చివరకు లోకేశ్ డిమాండ్ చేసినట్టుగానే జగన్ సర్కారు పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. నారా లోకేశ్ పై జనం హర్షాతరేకాలు వ్యక్తం చేశారు. ఏ విషయంపై అయినా సమగ్ర అధ్యయనం తర్వాతే నారా లోకేశ్ పోరాటం ప్రారంభిస్తారని, లోకేశ్ డిమాండ్ లో న్యాయం ఉంటుందని కూడా ఇప్పుడు జనం నమ్ముతున్నారు. మొన్నటికి మొన్న గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్మ హత్య కేసు విషయంలోనూ జగన్ సర్కారుకు ఊపిరాకడకుండా చేసిన లోకేశ్.. లైంగిక వేధింపులకు గురైన బాధితులకు భరోసా ఇచ్చారనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు లోకేశ్ ఇంకో కీలకమైన విషయంపై పోరు ప్రారంభించారు. అదేంటంటే.. రాష్ట్రంలో పలు కారణాలు చెబుతూ లక్షలాది మంది వృద్ధుల పింఛన్లను తొలగిస్తున్న జగన్ సర్కారుపై లోకేశ్ సోమవారం పోరాటం ప్రారంభించారు.
పోరులో తొలి ట్వీట్ ఇదే..
సోమవారం ఉదయమే వృద్ధాప్య పింఛన్లను తొలగిస్తూ సాగుతున్న జగన్ సర్కారు తీరును నిరసిస్తూ లోకేశ్ తన ట్విట్టర్ వేదికగా పోరు మొదలెట్టేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయమే ఈ విషయంపై ఆయన వరుస ట్వీట్లు సంధించారు. ఈ ట్వీట్లలో లోకేశ్ ఏమన్నారంటే.. ‘‘పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న వైఎస్ జగన్ తుంచుకుంటూ పోతున్నారు. రూ.3 వేల పెన్షన్ ఇస్తానని ఆశపెట్టి మాట మార్చారు, మడమ తిప్పారు. 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తానని డాబు కబుర్లు చెప్పి అడ్డమైన కారణాలు చెబుతూ భారీగా పెన్షన్లు కోతపెడుతున్నారు. గత రెండు నెలల్లోనే 2.30 లక్షల పెన్షన్లు లేపేసి అవ్వా తాతలకు తీరని అన్యాయం చేసారు. మీరు పెడుతున్న మానసిక క్షోభ భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనే ఆధారంగా బతుకుతున్న 13 మంది వృద్ధులు మృతి చెందారు. మీరిచ్చిన హామీ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు రూ.2,750 పెన్షన్ ఇవ్వాలి. ప్రతి అవ్వా తాత దగ్గరా నెలకు రూ.500 కొట్టేస్తున్నదేకాక భారీగా పెన్షన్లు కోసేస్తున్న పాపం వూరికేపోదు వైఎస్ జగన్ గారు. ఆరోగ్య సమస్యలు, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వారి పెన్షన్లు తీసేయడం సబబు కాదు. ఎత్తేసిన పెన్షన్లు అన్ని వెంటనే ఇవ్వాలి’’ అంటూ లోకేశ్.. జగన్ మార్కు మోసాన్ని బయటపెట్టారు.
కృష్ణా జిల్లా ఫ్లెక్సీ వైరల్
వృద్ధాప్య పింఛన్ల కోతపై నారా లోకేశ్ పోరు మొదలెట్టిన ఒక రోజు ముందుగా.. అంటే ఆదివారం కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో వెలసిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పింఛన్ దారుల మాదిరే జగనన్న చేయూత లబ్ధిదారుల విషయంలోనూ ఇప్పటికే వైసీపీ సర్కారు కోతలు మొదలెట్టేసింది. నారా లోకేశ్ సాగిస్తున్న పోరాటాన్ని ఆదర్శంగా తీసుకున్న టీడీపీ నేతలు చేయూత కోతలపై నేరుగా హైకోర్టునే ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. మండల పరిధిలోని 33 మందికి నిలిపోయిన చేయూతను పురనుద్ధరించాలంటూ సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పును ప్రస్తావిస్తూ.. టీడీపీ తుర్లపాడు గ్రామ శాఖ ఓ వినూత్న ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీపై నారా లోకేశ్ ఫొటో ప్రముఖంగా కనిపించేలా చేసిన టీడీపీ గ్రామ శాఖ.. చేయూత పథకాన్ని పునరుద్ధరిస్తూ సంచలన తీర్పు చెప్పిన హైకోర్టును ‘‘న్యాయ దేవతా నీవే మాకు దిక్కు’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలను ప్రచురించింది.
MustRead ;- మళ్లీ జగన్ బాదుడు.. జనం బెంబేలు











