ఏపీ సీఎం చంద్రబాబుపై వివిధ సెక్షన్లతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెల 24 ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు ఎప్‌ఐఆర్ రిపోర్టులో ఉండడం గమనార్హం. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో చంద్రబాబు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లి నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు బాబుపై 120బీ, 166, 167, 217 ఐపీసీ సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23న విచారణకు రావాలని నారాయణకు ఇచ్చిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. రాజధాని ప్రకటనకు ముందే తన అనుచరులకు సమాచారం ఇచ్చి అక్కడ దళితులకు చెందిన అసైన్డు భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదు అయినట్లు సమాచారం. కాగా ఈ నోటీసులపై చంద్రబాబు న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. విచారణకు హాజరు కావాలా..వద్దా.. లేక న్యాయపోరాటం చేయాలా అనే కోణంలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు సీఎం జగన్‌పై మండిపడుతున్నారు. అమరావతి వ్యవహారంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారం లేదని కోర్టులు తేల్చినా.. చంద్రబాబును ఇరికించేందుకు సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఏమీ చేయలేక చివరికి ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారని విమర్శిస్తున్నారు.
Also Read : హల్ చల్ : ‘నేను సీఎం జగన్ రెండో భార్యని’