ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శనివారం మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఎన్నికలను వాయిదా వేయించేందుకు జగన్ సర్కారు చేసిన యత్నాలన్నీ దాదాపుగా వీగిపోగా… శనివారం ఉదయం తొలి విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమైపోయారు. శనివారం ఉదయం 10 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన నిమ్మగడ్డ… అందులోనే ఎన్నికల నోటిఫికేషన్ ను జారీ చేయనున్నారు.
ఎస్ఈసీ హోదాలో నిమ్మగడ్డ నోటిఫికేషన్ జారీ చేసినా.. ఎన్నికల క్రతువులో తొలి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తేనే… ఎన్నికల క్రతువు ప్రారంభం కానుంది. అయితే ఎన్నికలను వాయిదా వేయించడమే లక్ష్యంగా సాగుతున్న జగన్ మోహన్ రెడ్డి సర్కారు... ఎస్ఈసీకి సహకరించకుండా ఉద్యోగులతో తనదైన శైలి వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగా ఎస్ఈసీ శనివారం నోటిఫికేషన్ జారీ చేసినా.. సోమవారం నాడు జిల్లా కలెక్టర్ల నుంచి నామినేషన్లకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నా.. అధికారుల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఎన్నికల క్రతువు ముందుకు సాగేలా కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి శుక్రవారం పలు కీలక పరిణామాలు నాటకీయ పద్దతిలో చోటుచేసుకున్నాయి. ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో శుక్రవారం నేరుగా రంగంలోకి దిగిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఎన్నికల నిర్వహణకు సిద్ధమైపోయారు. అందులో భాగంగా ఓటర్ల జాబితాతో తన వద్దకు రావాలంటూ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే సహాయ నిరాకరణ ప్రారంభించేసిన పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా ప్రసాద్ లు తమకు సీఎం జగన్ తో సమావేశాలున్నాయని, మధ్యాహ్నం 3 గంటలకు వస్తామని ఎస్ఈసీకి తెలిపారు. దీంతో ఎస్ఈసీ కూడా సదరు సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకే ఫిక్స్ చేసుకున్నారు.
Must Read ;- స్థానిక ఎన్నికలు జరిగేనా? కేరళలో అలా.. మరి ఏపీలో ఎలా?
అయితే తామే చెప్పినట్లుగా ద్వివేదీ, గిరిజా ప్రసాద్ లు 3 గంటలకు కూడా ఎస్ఈసీ వద్దకు రాలేదు. దీంతో సాయంత్రం 5 గంటలకు సమావేశానికి రావాలని నిమ్మగడ్డ వారికి సమాచారం చేరవేశారు. అంతేకాకుండా ఉద్యోగుల సహాయ నిరాకరణపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ… ఎంపీటీసీ, జడ్సీటీసీ ఎన్నికల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రెండు జిల్లాల కలెక్టర్లు, ఓ జిల్లా ఎస్పీ సహా మొత్తం 9 మంది అధికారులపై చర్యలకు ఉపక్రమించారు.
సదరు అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతూ వారి స్థానంలో వేరే వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు సూచించారు. ఈ ఆదేశాలను కూడా సీఎస్ పెద్దగా పట్టించుకోకుండానే సాయంత్రం గడిచిన తర్వాత ఎస్ఈసీకి 7 పేజీల లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, కోవిడ్ వ్యాక్సినేషన్ రెంటినీ ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదని సదరు లేఖలో తెలిపారు. అంతేకాకుండా తాము ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, దానిపై సోమవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుందని, ఆ తీర్పు వచ్చే వరకైనా ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలంటూ ఎస్ఈసీని కోరారు.
ఈ లేఖ ఎస్ఈసీ కార్యాలయానికి అందేలోగానే… నిమ్మగడ్డ ఇంటికి వెళ్లిపోయారు. నిమ్మగడ్డ వెళ్లిపోయిన తర్వాత తాపీగా ద్వివేదీ, గిరిజా ప్రసాద్ లు ఎస్ఈసీకి వచ్చారు. అప్పటికి నిమ్మగడ్డ లేకపోవడంతో… ఎన్నికల నోటిఫికేషన్ ను వాయిదా వేయాలన్న తమ లేఖను ఎస్ఈసీ కార్యాలయంలో అందజేసి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే… గురువారం నాడు స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినంతనే రంగంలోకి దిగిన జగన్ సర్కారు… ఎన్నికలను ఆపేందుకు ఉన్న చివరి అవకాశంగా పరిగణిస్తున్న సుప్రీంకోర్టు తలుపు తట్టింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వేస్తున్న క్రమంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలుపుతూ… ఎస్ఈసీని ఎన్నికలు నిర్వహించకుండా నిలువరించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ వాదనను సమర్ధిస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాలు కూడా మరో పిటిషన్ ను దాఖలు చేశాయి.
అంతేకాకుండా తమ పిటిషన్లను అత్యవసరంగా విచారణ చేపట్టాలని జగన్ సర్కారు సుప్రీంకోర్టును కోరింది. అయితే పిటిషన్ తప్పులతడకగా ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అసలు పిటిషన్ నే స్వీకరించలేదు. దీంతో అప్పటికప్పుడు పిటిషన్ లోని తప్పొప్పులను సరిదిద్దించిన జగన్ సర్కారు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ దఫా పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దానిని అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని, సోమవారం విచారణ చేపడతామని పేర్కొంది. అంతేకాకుండా జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ అబ్దుల్ నజీర్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నట్లుగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ప్రకటించింది.
ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ సర్కారు ఎస్ఈసీని నిలువరించే యత్నం చేసింది. సుప్రీంకోర్టు విచారణను సాకుగా చూపుతూ సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు లేఖ రాశారు. అయితే వీటిని అంతగా పట్టించుకోని నిమ్మగడ్డ శనివారం తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసేందుకే నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. మరి నిమ్మగడ్డ నోటిఫికేషన్ జారీ చేస్తే… నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ను జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారా? లేదంటే వారితో జగన్ సర్కారు సహాయ నిరాకణ మంత్రాన్ని పఠిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. మొత్తంగా శుక్రవారం ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకోగా… శనివారం నాడు మరింత ఆసక్తికర పరిణామాలు చోటుచేకునే అవకాశాలున్నాయి.
Also Read ;- సంక్షోభాన్ని తప్పించడమే ‘సుప్రీం’