ఏపీలో జగన్ సర్కారు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ల మధ్య కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి శుక్రవారం ఎస్ఈసీతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ భేటీ కాగా… ఈ భేటీలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా లేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇక నిమ్మగడ్డ ఎస్ఈసీగా ఉండగా… ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న వాదనలు వినిపించాయి. అయితే అందరినీ పెను షాక్‌కు గురి చేస్తూ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏకంగా షెడ్యూల్‌ను విడుదల చేసిన నిమ్మగడ్డ… సదరు ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించనున్నట్లుగా ప్రకటించేశారు.
నిమ్మగడ్డ జారీ చేసిన స్థానిక సంస్థల షెడ్యూల్ ప్రకారం… ఈ నెల 23నే తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే విధంగా 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ తేదీలను ప్రకటించేసిన నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు కూడా పకడ్బందీ ప్రణాళికను ప్రకటించేశారు. ఎస్ఈసీ ప్రకటన ప్రకారం… ఫిబ్రవరి 5న తొలి దశ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ, ఫిబ్రవరి 13న మూడో దశ, ఫిబ్రవరి 17న నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా జగన్ సర్కారుకు షాకిచ్చేలా నిమ్మగడ్డ రిలీజ్ చేసిన ఎన్నికల షెడ్యూల్… ఈ నెల 23తో మొదలు కానుండగా… వచ్చే నెల అంటే ఫిబ్రవరి 17తో ముగియనుందన్న మాట. నిమ్మగడ్డ నుంచి ఈ తరహా షాకింగ్ న్యూస్‌ను ఊహించని జగన్ సర్కారు… ఏ రీతిన స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Must Read ;- స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరపలేమని తేల్చిన సీఎస్











