ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వర్సెస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు మాదిరిగా హోరాహోరీగా సాగిన ఈ భీకర పోరుకు ఇప్పుడు నిమ్మగడ్డ సంధించిన ఎన్నికల షెడ్యూల్ పతాక స్థాయేనని చెప్పక తప్పదు. అయితే ఎన్నికల నిర్వహణకు ససేమిరా అంటున్నజగన్ సర్కారు… నిమ్మగడ్డ జారీ చేసిన షెడ్యూల్ ను రద్దు చేసే దిశగా ఎలాంటి అడుగులు వేయబోతోందన్నది ఇప్పుడు అమితాసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ పోరులో గెలుపు ఎవరిదన్న విషయాన్ని పక్కనపెడితే… అసలు నిమ్మగడ్డ ప్రకటించినట్టుగా షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరగుతాయా? అన్నది మరింత ఆసక్తి రేకెత్తించే అంశమేనని చెప్పాలి. అంతేకాకుండా శనివారం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు కూడా వేగంగానే స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచే చాలా వేగంగా పావులు కదిపిన జగన్ సర్కారు… నిమ్మగడ్డను కట్టడి చేసేందుకు ఏకంగా శనివారమే సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జగన్ సర్కారు ఓకే అనగా… అప్పుడే ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అప్పుడే కరోనా విలయతాండవం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై పునరాలోచన చేసిని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై జగన్ సర్కారు వేగంగా రియాక్ట్ అయ్యింది. స్వయంగా సీఎం హోదాలోనే మీడియా ముందుకు వచ్చిన జగన్… నిమ్మగడ్డపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటుగా ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
అక్కడి నుంచి మొదలైన స్థానిక సంస్థల రచ్చ రోజుకో ట్విస్ట్ చొప్పున రక్తి కట్టించింది. ఇరు వర్గాలు కోర్టులను ఆశ్రయించడం, ఓ సారి ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు వస్తే… మరోమారు జగన్ సర్కారుకు ఓ మోస్తరు అనుకూలంగా కోర్టు నిర్ణయాలు వెలువడ్డాయి. మొత్తంగా ఇరువర్గాలు కూర్చుని సానుకూల వాతావరణంలో మాట్లాడుకుని ముందుకెళ్లాలని ఇటీవలే కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పునకు అనుగుణంగా ఎస్ఈసీతో శుక్రవారం సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కరోనా వ్యాక్సిన్ వేయిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని సీఎస్ దాస్ నిమ్మగడ్డకు చెప్పేసి వచ్చారు.
దాస్ బృందం ఎస్ఈసీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన మరుక్షణమే రంగంలోకి దిగిన నిమ్మగడ్డ… అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించనున్నట్లుగా తేదీలతో సహా షెడ్యూల్ విడుదల చేసేశారు. దీంతో శనివారం ఉదయం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఇలాంటి నేపథ్యంలో నిమ్మగడ్డ మాదిరే జగన్ సర్కారు కూడా వేగంగానే కదిలింది. ఎన్నికల నిర్వహణపై తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ఎన్నికల నిర్వహణ అసాధ్యమన్న తమ వాదనను పరిగణనలోకి తీసుకోవాలని, ఎన్నికల క్రతువును నిలిపివేయాలని సీఎస్ దాస్.. నిమ్మగడ్డకు ఓ లేఖ రాశారు. అయితే దాస్ లేఖతో నిమ్మగడ్డ వెనకడుగు వేసే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో శనివారం ఉదయమే జగన్ సర్కారు సుప్రీంకోర్టు గడప తొక్కనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో, అది కూడా ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ కు విరుగుడు అయిన వ్యాక్సిన్ పంపిణీని మొదలుపెడుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమన్న కోణాన్ని ఆసరా చేసుకుని జగన్ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజ్యాంగబద్ధమైన సంస్థ అయిన ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ను నిలుపుదల చేసే విషయంలో సుప్రీంకోర్టు అంత ఈజీగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పలేమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఉరుము లేని పిడుగులా ఏకంగా ఎన్నికల షెడ్యూల్ ను నిమ్మగడ్డ విడుదల చేయగా… దానిని అడ్డుకునేందుకు జగన్ సర్కారు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Must Read ;- విజయసాయిరెడ్డి సిగ్నల్స్.. ఏప్రిల్, మే నెలల్లో స్థానిక ఎన్నికలు