లాక్ డౌన్ దాటి అన్ లాక్ దశకు చేరుకుంటున్న మానవాళిని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. వివిధ దేశాల్లో మళ్లీ లాక్ డౌన్ లు అమలవుతున్నాయి. మన దేశంలో ఉత్తరాదిలోనూ కరోనా నిబంధనలను కఠిన తరం చేశారు. రికవరీ రేటు ఆశాజనకంగానే ఉన్నా వయసు మళ్లిన వారిలో మాత్రం మళ్లీ భయాందోళనలు నెలకొంటున్నాయి. వాక్సిన్ కోసం ఎంతో మంది ఆశగా ఎదురుచూస్తున్నా ఆ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చకుంటూ వస్తుందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు.
Also Read:-మోడీ నోట మరోమారు లాక్ డౌన్ మాట
కేసుల సంఖ్యలో పెరుగుదల చూస్తుంటే జనంలో మళ్లీ ఆందోళన కలుగుతోంది. మళ్లీ లాక్ డౌన్ విధించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. స్పెయిన్ ఇప్పటికే ఎమర్జెన్సీని 2021 మార్చి వరకూ పొడిగించింది. ఇంగ్లండులో ఒక నెల రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఫ్రాన్స్ లోనూ రెండు వారాలు లాక్ డౌన్ తప్పలేదు. ఇక జర్మనీ విషయానికి వస్తే నాలుగు వారాల లాక్ డౌన్ విధించింది. ఇటలీ కూడా ఇదే అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుంది.
చరిత్ర ఏం చెబుతోంది?
ఇలాంటి వైరస్ ల గురించి తెలియాలంటే మనకు చరిత్ర తప్ప మరో మార్గం లేదు. 1917లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. 1917లో ప్రారంభమై 1919 వరకూ ఈ స్పానిష్ ఫ్లూ తన ప్రతాపాన్ని చూపింది. ఆ సమయంలో కోట్లాది మంది మరణించారు. స్పానిష్ ఫ్లూ రెండో సారి వచ్చినప్పుడు దాని తీవ్రత మరింత పెరిగిందని చెబుతారు. తాజా పరిణామాలను ఆయా దేశాలు జాగ్రత్తతో పరిశీలిస్తున్నాయి. ఈసారి పరిస్థితి తీవ్రంగా మారితో ఏంచేయాలా అన్న ఆలోచన కూడా మొదలైంది.
మన ఇండియాలోనూ కరోనా రెండో దశ ప్రభావం కనిపిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే బాధితుల సంఖ్య కోటి దాటింది. అయితే రికవరీ శాతం 93 వరకూ ఉంది. ఢిల్లీ, ముంబయి, అహమ్మదాబాద్, భోపాల్ లాంటి పెద్ద నగరాల్లో కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. దాంతో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో కర్ఫ్యూ కూడా విధిస్తున్నాయి.
Also Read:-కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?
ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినతరం చేసింది. మాస్క్ వేసుకోకపోతే రెండు వేల జరిమానా విధిస్తామని ప్రకటించింది. శుభ కార్యాల్లో 50 మందికి మించి పాల్గొనకూడదు. ముంబయిలో డిసెంబరు నెలాఖరు వరకు స్కూల్సు మూసివేస్తారు. లోకల్ రైలు ప్రయాణాలు కూడా ఉండవు. గుజరాత్ లో కర్ఫ్యూ నిబంధనులు వచ్చేశాయి. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. కరోనా రెండో దశ వచ్చిన ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కరోనా రెండు దశ విషయంలో అన్ని ప్రభుత్వాలూ అప్రమత్తంగానే ఉన్నాయి.