కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్స్ మూత పడేలా చేసింది. ఇండియా లో ఇంకా థియేటర్స్ తెరుచుకోలేదు కానీ విదేశాల్లో ఈ మధ్య ఓ భారీ సినిమా విడుదలైంది. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ‘ టెనెట్’ సినిమా అది. నోలన్ సినిమా అంటే వరల్డ్ వైడ్ గా సినీ అభిమానులు ఊగిపోతారు కానీ ఈ సినిమా కేవలం యాబై శాతం దేశాల్లో మాత్రమే విడుదలైంది. ఆయా దేశాల రూల్స్ కి అనుగుణంగా థియేటర్స్ లో సీటింగ్ కెపాసిటీ మార్పు చేశారు. మొత్తం శానిటైజ్ చేశారు. అయినా ఆక్యుపెన్సీ అరవై శాతం దాటలేదు.
ఇంకా న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ లాంటి నగరాల్లో థియేటర్స్ ఇంకా తెరవలేదు. నోలన్ గత చిత్రం ‘Dunkirk’అమెరికాలో 3,700 థియేటర్స్ లో రిలీజ్ అయితే టెనెట్ సినిమా 2,000 థియేటర్స్ మించి విడుదల కాలేకపోయింది. హాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ఇది. రెండు వందల మిలియన్ల డాలర్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మాములు రోజుల్లో అయితే వారం రోజుల్లో రికార్డ్ వసూళ్లు సాధించేది. కానీ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ నిపుణులు కనీసం 450 డాలర్ల మిలియన్స్ వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు అంటున్నారు.
సెప్టెంబర్ 4 నుంచి మరి కొన్ని దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. సినిమా బాగున్నప్పటికీ నోలన్ గత సినిమాల స్థాయిలో లేదంటున్నారు. మొదటి వారం కలెక్షన్స్ 20-30 మిలియన్స్ డాలర్స్ దాట లేదు అంటున్నారు. ఈ లెక్కన సినిమా బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పట్టాలంటే ఆరేడు నెలల లాంగ్ రన్ కావాలి. హాలీవుడ్ లాంగ్ రన్ అనే మాట ఎప్పుడో మర్చిపోయింది. అంతకాలం ఈ సినిమాని డిజిటల్ ప్లాటుఫారం మీదకి రాకుండా ఆపడం కష్టం.
ఇంత క్రేజ్ ఉన్న సినిమాకే ఇలా ఉంటే మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి ? ఇదే హాలీవుడ్ కి మిలియన్ డాలర్స్ ప్రశ్న అయికూర్చుంది. సినిమా బడ్జెట్స్ తగ్గించాలా ?! సినిమా విడుదలలు మరి కొంతకాలం వాయిదా వేయాలా ? అనే అయోమయ స్థితిలో ఉంది హాలీవుడ్. ఈ పరిణామాలను తెలుగు సినీ పరిశ్రమ కూడా గమనించి అడుగు ముందుకి వేయాల్సిందే.