(శ్రీకాకుళం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
సాధారణంగా వైద్య ఆరోగ్య శాఖకు డాక్టరీ చదువుకున్న ఎమ్మెల్యేనే మంత్రిని చేస్తుంటారు. అలా ప్రతి శాఖకూ కుదరకపోవచ్చు. కానీ.. మత్స్యశాఖను చూస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు మాత్రం.. తన పూర్వాశ్రమంలోని వృత్తిని మరచిపోలేదు. చేపల వేటకు వెళ్లారు. ఆ మూలాల్లోంచి వచ్చిన ఆ శాఖను చూడడం మాత్రమే కాదు.. సరదా కోసమే అయినా.. ప్రాక్టికల్ గా వారి కష్టనష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం విశేషం.
సతీసమేతంగా మంత్రి ఆటవిడుపు
దసరా అంటే అందరికీ సరదానే .. ఆ రోజు ఆడాలి .. పాడాలి .. సతీసమేతంగా పిల్లాపాపలతో కేరింతలు కొట్టాలని, ఆనందంగా గడపాలని ఉంటుంది. అయితే బాధ్యతలు, ఇతరత్రా అడ్డొస్తుంటాయి. ప్రజాప్రతినిధులు, మంత్రుల పరిస్థితి మరింత హడావుడిగా ఉంటుంది. నిత్యం సమీక్షలు.. సమావేశాలు. విన్నపాలు, విజ్ఞప్తులు. వాటన్నింటినీ పక్కన పెట్టి శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సతీసమేతంగా సముద్రంలో జలకాలు ఆడారు. బోటు షికారు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి చేపలు పట్టారు.
చిన్ననాటి వాంఛ తీరెను ఇలా ..
రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు దసరా సందర్భంగా తన చిన్ననాటి వాంఛ తీర్చుకున్నారు. ఎక్కడ తన ప్రస్థానం మొదలైందో మళ్లీ అక్కడకే వెళ్లి సేద తీరారు. తన చిన్ననాటి మిత్రులతో కలసి సరదాగా చేపలు పట్టి వారిలో ఆనందం నింపారు. తండ్రి, సోదరులతో వేట చేయాలని ఉన్నా నాడు బాల్యమంతా చదువు, ఆ తర్వాత వైద్య వృత్తి వల్ల సాకారం కానప్పటికీ.. ఇప్పటికి ఆయన తెడ్డు పట్టుకుని సంద్రంలోకి దిగారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని ఆయన స్వగ్రామం దేవునల్తాడలో దసరా రోజున సముద్ర తీరంలో కుటుంబ సభ్యులతో రోజంతా గడిపారు. తోటి మత్స్యకారులతో కలిసి వల వేసి చేపలు పట్టారు. సోదరుడు సీదిరి చిరంజీవి చేపల వేట సాగించే బోటుపై సంద్రంలోకి వెళ్లారు. వల పట్టుకుని వృత్తిలో లీనమయ్యారు.
30 పనాల వరకు చేపలు చిక్కడంతో ఆయన ఆనందంతో ఎగిరి గంతేశారు. అనంతరం చేపలతో తీరానికి చేరుకున్న మంత్రి భావనపాడు తీరానికి సతీసమేతంగా వెళ్లి సముద్ర స్నానాలు చేశారు. చిన్న నాటి స్నేహితులు తెరిపల్లి వరదరాజులు, సౌదాల వెంకన్న, సిరిగిడి వాసు, ఇతర కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా అక్కడే భోజనాలు చేసి సముద్రం ఒడిలో సేదతీరారు. దసరా రోజంతా ఇలా మంత్రిగారు ఆటవిడుపు ఉత్తరాంధ్ర అంతటా ఆసక్తిని రేకెత్తించింది.
బాల్యం గుర్తొచ్చింది
‘‘చాలా రోజులకు మళ్లీ చేపల వేటకు వెళ్లాను. కుటుంబం, స్నేహితుల మధ్య సరదాగా గడపడంతో బాల్యం గుర్తుకు వచ్చింది. ఇదో గొప్ప అనుభూతి. భావనపాడు ఫిషింగ్ హార్బర్‌లో ఎన్ని రకాల బోట్‌లు ఉన్నాయి. ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది అనేది పరిశీలించాను. కొత్త రకమైన వలలు ఎన్ని వచ్చాయి. అ వలల పనితీరు ఎలా ఉంది. వారి అవసరాలేంటి? అనేదానిపై అక్కడ ఉన్న మత్స్యకారులతో మాట్లాడాను. మత్స్యకారులకు ఉన్న పథకాల వివరించా. బోటింగ్ చేశాక రింగ్ వల పట్టుకుని సహచరులతో కలిసి చేపల ఎర కనిపించిన వెంటనే వల వేశాం. మత్స్యకారులకు హార్బర్ అవసరం, ఇంజిన్లు సరఫరా చేయాల్సిన అవసరాన్ని నేరుగా పరిశీలించడం ఒక అవకాశంగా భావిస్తున్నాను’’ అని ఆటవిడుపు అనంతరం మీడియాతో మంత్రి అప్పలరాజు అన్నారు.