తెలుగు తెరపై యాక్షన్ హీరోలుగా ఒక వెలుగు వెలిగినవారి జాబితాలో సుమన్ .. భానుచందర్ ముందువరుసలో కనిపిస్తారు. సుమన్ .. భానుచందర్ ఇద్దరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వలన, ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను ఈ ఇద్దరితో యాక్షన్ సినిమాలను నిర్మించడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపేవారు. అలా ఆ ఇద్దరూ కలిసి దాదాపు 15 సినిమాల వరకూ కలిసి నటించారు. తెలుగులో తొలి మార్షల్ ఆర్ట్స్ మూవీగా చెప్పబడే ‘ఇద్దరు కిలాడీలు’ సినిమాలో ఈ ఇద్దరే కథానాయకులు. అప్పట్లో ఈ యాక్షన్ హీరోలిద్దరికీ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది. తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వచ్చిన ఈ ఇద్దరూ, తమ అనుభవాలను .. జ్ఞాపకాలను ఈ వేదిక ద్వారా పంచుకున్నారు.
సుమన్ మాట్లాడుతూ .. ” కెరియర్ తొలినాళ్ల నుంచి నేను .. భానుచందర్ మంచి స్నేహితులం. భానుచందర్ వాళ్ల నాన్నగారు మాస్టర్ వేణు గొప్ప సంగీత దర్శకులు. అందువలన వాళ్ల ఇంటికి చాలామంది సినిమావాళ్లు వచ్చి వెళుతుండేవారు. నేను భానుచందర్ కలిసి వాళ్ల ఇంట్లోనే భోజనం చేసి, వాళ్ల డాబాపై సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఇద్దరం కూడా తమిళ సినిమాలు వరుసగా చేసుకుంటూ వెళుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో “నువ్వు చాలా హ్యాండ్ సమ్ గా ఉంటావు గనుక నీకు తెలుగు ఇండస్ట్రీ కరెక్ట్ .. అక్కడ నువ్వు స్టార్ హీరో అవుతావు” అని చెప్పేసి భానుచందర్ నన్ను ఇక్కడికి పంపించాడు.
Also Read ;- టాలీవుడ్ నాకు ప్రాణ సమానం.. అపార్ధం చేసుకోకండి. !
తెలుగులో నేను హీరోగా చేసిన ‘తరంగిణి’ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా నుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. ఇండస్ట్రీలో ఒక ఐదేళ్లపాటు నిలబడితే చాలు అనుకుని వచ్చిన నన్ను ఇప్పటికీ అభిమానిస్తున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండటానికి కారకుడు భానుచందర్. అందువల్లనే ప్రతి ఇంటర్వ్యూలో ఆయన పేరు తప్పకుండా చెబుతుంటాను. అలా చెప్పడం నా కనీస బాధ్యత. మేము ఇద్దరం కలిసి యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేశాం. ఆ సమయంలో దెబ్బలు ఎక్కువగానే తగిలేవి .. అయినా పట్టించుకోకుండా అలాగే చేసేవాళ్లం.
నాకు తెలుగు అంతగా వచ్చేది కాదు .. అందువలన నాకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పేవాడు. తెలుగు భాషను నేర్చుకున్న తరువాత నేను డబ్బింగ్ చెప్పుకుంటాననే అన్నాను. కానీ ఆల్రెడీ సాయికుమార్ వాయిస్ అందరికీ నోటెడ్ అయిపోయింది గనుక, అలాగే కంటిన్యూ చేయడమే మంచిదని దర్శక నిర్మాతలు అనడం వలన నేను నా పాత్రకి డబ్బింగ్ చెప్పలేకపోయాను. ‘అన్నమయ్య’ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా నా పాత్రకి నేను వాయిస్ ఇవ్వని కారణంగా అవార్డు ఇవ్వకపోవడమనేది కరెక్ట్ కాదనిపించింది. ప్రేక్షకుల అభిమానానికి మించిన అవార్డు లేదనుకోవడం నాకు సంతృప్తిని కలిగించింది” అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.
Must Read ;- కాలంలోకి ప్రయాణంలోని అనుభూతిని మిగిల్చే ‘టెనెట్’