దేశం మొత్తం ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ అతిత్వరలోనే రాబోతుందని సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. అన్ని కుదిరితే డిసెంబర్ నెలలోనే కరోనా టీకాను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 10 కోట్ల డోసులను పంపిణీ చేసేందుకు సీరం సిద్ధమవుతోంది. సీరం ఇన్‌స్టిట్యూట్ భాగస్వామ్యంతో ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకా కోవిషీల్డ్‌ను అందుబాటులోకి తేనున్నారు. కేద్రం నుంచి అత్యవసర అనుమతులు లభించిన వెంటనే మొత్తం పది కోట్ల డోసులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాదిలో పూర్తి స్థాయి అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
వంద కోట్ల డోసులు..
వంద కోట్ల డోసుల ఉత్పత్తి కోసం సీరం ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి ఆక్స్‌ఫర్డ్ జట్టు కట్టింది. అయితే ఇందులో ఉత్పత్తి అయిన సగం టీకా డోసులు పేద దేశాలకు పంపనున్నారు. కోవిషీల్డ్ టీకాకు సంబంధించి తుది ట్రయల్స్ పూర్తయి సత్ఫలితాలు వచ్చాయి. కరోనా వ్యాక్సిన్ కోసం సీరం సంస్థ మొత్తం 5 సంస్థలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వ్యాక్సిన్ లు కూడా ట్రయల్స్ దశలో ఉన్నాయి.
ఆస్ట్రాజెనెకా ఇప్పటికే గత రెండు నెలల్లో దాదాపు 4 కోట్ల డోసులను ఉత్పత్తి చేసింది. కోవిషీల్డ్‌తో పాటు సీరం సంస్థ ఒప్పందం చేసుకున్న మరో సంస్థ అయిన నోవావాక్స్ వ్యాక్సిన్ కూడా త్వరలో ఉత్పత్తి కానుంది. ఈ రెండు వ్యాక్సిన్‌ల పనితీరుపై సీరం సీఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతున్నట్లు ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కల్ సోరియట్ తెలిపారు.