కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గింది. పాజిటివిటీ రేటు మరింత పడిపోవడంతో రాష్ట్రాలు అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేయగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ఇచ్చింది. ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలను సడలించింది. ఈ జిల్లాల్లో కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది.
పాజిటివిటీ రేటు తక్కువే..
ఏసీ సీఎం జగన్ రెడ్డి సోమవారం వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో సడలింపులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఆంక్షలను సడలించారు. ఇక ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం యథావిధిగా కొనసాగతాయని స్పష్టం చేశారు. జులై 1 నుంచి జులై 7 వరకూ ఈ నిర్ణయాలు వర్తిస్తాయని సీఎం తెలిపారు.
ఏపీలో కొత్త కేసులు 4,147
గడచిన 24 గంటల్లో 96,121 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,147 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. తూర్పు గోదావరి జిల్లాలో 838 కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరిలో 571, చిత్తూరు జిల్లాలో 569 కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అతి తక్కువగా (128) కేసులు నమోదయ్యాయి. 38 మంది చనిపోయారు.











