లాస్టియర్ ‘పెంగ్విన్ , మిస్ ఇండియా’ సినిమాలతో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని పలకరించింది అందాల కీర్తి సురేష్ . అయితే ఆ రెండు సినిమాలు అమ్మడికి తీవ్ర నిరాశనే కలిగించాయి. అయితే ఈ ఏడాది వివిధ భాషల్లో వరుస సినిమాల్ని లైన్ లో పెట్టుకుంది. వాటిలో ‘మరక్కార్ : అరబ్బిక్కడలిండే సింహం మలయాళ చిత్రం, రంగ్ దే, గుడ్ లక్ సఖి’ తెలుగు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. వీటిలో రెండు సినిమాలకి విడుదల తేదీలు ఖాయం అయ్యాయి. ఇప్పుడు ‘గుడ్ లక్ సఖి’ కి కూడా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్ . ఈ సినిమాని జూన్ 3న థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు.
గుడ్ లక్ సఖి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగేశ్ కుకునూర్ తెరకెక్కించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే.. ఒక షూటర్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తోన్న ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదలకానుంది. వర్తే ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా.. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఆ మధ్య విడుదలైన గుడ్ లక్ సఖి టీజర్ బాగా ఆకట్టుకుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా .. కీర్తికి ఏ రేంజ్ కీర్తిని తెచ్చిపెడుతుందో చూడాలి.