శారదా పీఠాదిపతి స్వామి స్వరూపానందేంద్ర పుట్టిన రోజైన నవంబరు 18న అధికారికంగా ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై ప్రభుత్వం, అధికార వైసీపీ సమర్థించుకుంటుండగా ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. వైఎస్ జగన్ కు, విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర గత సాన్నిహిత్యం పైనా చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఈ సాన్నిహిత్యం.. జగన్ కి ఈ మధ్య ఏర్పడింది కాదు. బయటకు తెలిసి ఆరేళ్లకుపైగా ప్రచారం ఉంది.
పేరు బయటకు వచ్చింది ఇలా..
విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఆధ్యాత్మికంగా చాలాసంవత్సరాలుగా అందరికీ తెలిసినా.. 2012లో సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆయన పేరు మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. 2012లో అప్పటి ప్రభుత్వంపైన స్వామి స్వరూపానందేంద్ర విమర్శలు గుప్పించారు. అప్పట్లో సాయి పాదుకలు తిరుమలకు తీసుకెళ్లడంపై విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఆక్షేపించారు. అదే టైంలో చినజీయర్ స్వామిపైనా విమర్శలు గుప్పించడంతో దేశ వ్యాప్తంగా చర్చ నడిచింది. తిరుమల సంప్రదాయాలను చినజీయర మంటగలుపుతున్నారని విమర్శించారు. అప్పటి టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజుపైనా విమర్శలు గుప్పించారు స్వామి స్వరూపానందేంద్ర. అయితే అప్పట్లోనే పలువురు రాజకీయ నాయకులు ఈ పీఠాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందేవారు. విశాఖలో ఉన్న తన సన్నిహితుల ద్వార పీఠాన్ని దర్శించారు వైఎస్ జగన్.
2012కి ముందే ఈ పరిచయం ఏర్పడిందన్న అంశం కూడా ప్రచారంలో ఉంది. తరువాత కాలంలో 2016లో జగన్ ను స్వయంగా పీఠాధిపతి రిషికేశి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించడం, వైఎస్ జగన్ వెంట విజయసాయి రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు. డెహ్రాడూన్ సమీపంలోని నదిలో పవిత్ర స్నానం ఆచరించి ఈ యాగం చేశారని చెబుతారు. ఈ ఘటనననే జగన్ హిందువుగా మారాడని చెబుతున్నారని విమర్శించేవారూ ఉన్నారు. అప్పట్లోనే ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దల మనసు మారాలని, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేలా చేయాలని కూడా యాగం చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. జగన్ పాదయాత్రకు ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఇక రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన చంద్రబాబునే టార్గెట్ చేశారు. తిరుమల ఆస్తులు, ఆభరణాల విషయంలో చంద్రబాబుపై కేసు పెడతానని కూడా వ్యాఖ్యానించారు. 2016లో దేవుడి ప్రసాదాల పేరుతో సీజీఎఫ్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం జారీచేసిన జీవోలపై ఆయన డైరక్ట్ గా విమర్శలు గుప్పించారు. ఆ తరువాతి క్రమంలో కేసీఆర్ కోసం రాజశ్యామల యాగం చేశారు. కేసీఆర్ సీఎం అయిన వెంటనే విశాఖ శారదాపీఠం అమ్మవారిని దర్శించుకున్నారు. వైఎస్ జగన్ కోసం కూడా స్వామి స్వరూపానందేంద్ర యాగం చేశారు. ఆయన కూడా సీఎం అయ్యాక పలుమార్లు శారదాపీఠాన్ని దర్శించుకున్నారు. రాజకీయనాయకులు స్వాములను దర్శించుకోవడం, ప్రత్యేక కానుకలు ఇవ్వడం సాధారణమే. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకు అతిథి మర్యాదలు చేస్తుంది. కొంత భూమిని కూడా కేటాయించింది. అది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అది వేరే విషయం.
అయితే తాజాగా జగన్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు కొత్త వివాదానికి తెరలేపాయి. దేశంలో ఎక్కడా వినని విధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని విమర్శలూ వస్తున్నాయి. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి చాతుర్మాస దీక్ష కి విజయవాడలో 2 నెలలు ఉన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి అతిథి మర్యాదల ఉత్తర్వులూ జారీ కాలేదు. శృంగేరీ పీఠాధిపతులకూ అదే పరిస్థితి. కాని ఓ ప్రైవేటు పీఠాధిపతి కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం, తిరుమలకు వెళ్లిన సమయంలో ఎయిర్ పోర్టు వచ్చి స్వాగతం పలకడం, అలిపిరి వద్దకు వచ్చి స్వాగతం పలకడం లాంటి చర్యలు కూడా చర్చకు కారణం అవుతున్నాయి. ఈ కోణంలో చూస్తే..రాజధానిని విశాఖ కు మార్చడం, మూడు రాజధానుల అంశంపైనా స్వామివారి సూచనలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందని ప్రతిపక్షాలూ విమర్శిస్తున్నాయి.