రాష్ట్రంలో మరొక ఎన్నికకు నగరా మోగింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఈ రోజు ఉదయం విడుదల చేశారు. ది లియో న్యూస్ ముందస్తుగా చెప్పినట్లుగానే డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రేపటి నుండి నామినేష్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈనెల 20న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ. 21న నామినేషన్లను పరిశీలిస్తారు. 22న ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ. అలాగే డిసెంబర్ 3న అవసరమైతే రీపోలింగ్ నిర్వహిస్తారు. 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడిస్తారని పార్థసారథి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఎన్నికల కమిషనర్ పార్థసారథి మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్, నామినేషన్ ప్రక్రియను విడుదల చేశారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈ ఎన్నికలు జరగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.షెడ్యూల్డ్ తో పాటే ఎన్నికల నోటిఫికేషన్ ను కూడా విడుదల చేయనున్నారు. మొత్తం 17 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ముంగించేలా ప్రణాళికలు రచించింది. ఈనెల 13వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం గ్రేటర్‌లో మొత్తం ఓట్లు 74.04 లక్షలు ఉన్నాయి. ఇందులో మహిళా ఓట్లు 47.90శాతం. పురుషుల ఓట్లు 52.09 శాతం ఉన్నాయి. బ్యాలెట్ పేపర్ల పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 2020 వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పిస్తామని కమిషనర్ తెలిపారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్ల అంశం ప్రభుత్వం పరిధిలోనిదన్నారు. రిజర్వేషన్ల అంశం గురించి హైకోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది.
Must Read:-చేతులెత్తేసిన సర్కార్ : ఎన్నికలు పెట్టలేం!
షెడ్యూల్ ఇదే…
-రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ
-నవంబర్ 20న నామినేషన్లకు చివరి రోజు
-20న నామినేష్లకు ఆఖరు తేదీ
-21న పరిశీలన
-22న ఉపసంహరణ
-డిసెంబర్ 1న పోలింగ్
-3న అవసరమైతే రీపోలింగ్
-4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి