పెరిగిన భూకబ్జాలు, సెటిల్మెంట్లు.. పరారైన కంపెనీలు, పోయిన ఉపాధి..
జీవన విధ్వంసంతో జనజీవనం కకావికలు
రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతం గత 4ఏళ్లుగా పాలకుల స్వార్ధం కారణంగా 40ఏళ్లు వెనక్కిపోవడం శోచనీయం..పరిపాలనా రాజధాని విశాఖలోనే అని, వచ్చే నెలనుంచి తానిక్కడే మకాం అని సీఎం జగన్మోహన్ రెడ్డి పాడిందేపాడరా అంటూ చెప్పే మాటలు అపహాస్యం పాలయ్యాయి..ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్ర నాలుగేళ్లుగా భూకబ్జాలు, సెటిల్మెంట్ దందాలకు నెలవు కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు…వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్రలో భూముల కబ్జాలు, ఖనిజ సంపద లూటీ, సహజవనరుల దోపిడీ పేట్రేగాయి. అందినకాడికి దోచుకోవాలనే ఆరాటం పాలకపార్టీ నేతల్లో పెరిగిపోయింది..ఎప్పుడే ఉపద్రవం ముంచుకొస్తుందో, ఎవరి ఆస్తులు కబ్జా చేస్తారో, ఎవరి ఇళ్లు కూల్చేస్తారో అనే భయాందోళనలతో ప్రజానీకం బిక్కుబిక్కు మంటోంది..
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ ఆపేశారు..ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులకు గత 4ఏళ్లలో ఖర్చుచేసింది కేవలం రూ 450కోట్లే అంటే ఈ ప్రాంతంపై వైసిపి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నిలిపేశారు. తారకరామ సాగర్ ప్రాజెక్టు పనులు టిడిపి 5ఏళ్లలో 47.51% చేస్తే, ఈ 4ఏళ్లలో 10%కూడా చేయలేదు. దీనిపై గత ప్రభుత్వం రూ 87కోట్లు ఖర్చుచేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఈ 4ఏళ్లలో రూ 4కోట్లు కూడా ఖర్చుపెట్టిన దాఖలా లేదు. గజపతినగరం బ్రాంచి కాలువ పనులు చంద్రబాబు 5ఏళ్లలో 51% జరిగితే, ఈ నాలుగేళ్లలో 7% చేయలేదు. వంశధార ఫేజ్ 2పనులు టిడిపి ప్రభుత్వం 95% చేస్తే ఇప్పుడు 1%కూడా జరగలేదు. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రూ 229కోట్లు ఖర్చుచేస్తే జగన్ సీఎం అయ్యాక ఖర్చుచేసింది రూ 50కోట్లు కూడా లేదు..తోటపల్లి రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసింది, ప్రారంభోత్సవం చేసింది చంద్రబాబే..ఆ ప్రాజెక్టు పనులు 2014-19మధ్య 91%పూర్తిచేస్తే ఇప్పుడీ ప్రభుత్వం వచ్చాక 1%కూడా చేయలేదు…సాగునీటి ప్రాజెక్టులపై ఆ 5ఏళ్లలో రూ 1600కోట్లు వ్యయం చేస్తే వైసిపి వచ్చాక రూ 500కోట్లు కూడా వ్యయం చేయలేదంటే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు వైసిపి గ్రహణం పట్టిందనేది ప్రజల్లోకి ప్రబలంగా వెళ్లింది..
విశాఖను ఐటి హబ్ గా చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కృషి చేసింది. రూ 145కోట్లతో 2లక్షల చ అడుగుల విస్తీర్ణంలో 10అంతస్తులుగా నిర్మించిన మిలీనియం టవర్స్ ను గత 4ఏళ్లుగా పాడుబెట్టారు, అక్కడి కంపెనీలను తరిమేశారు. రూ 90కోట్లతో అభివృద్ధి చేసిన ‘‘స్టార్టప్ విలేజి’’ని నాశనం చేశారు. నాలుగేళ్లలో 100 స్టార్టప్ కంపెనీలు మూతబడ్డాయంటే జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమిటో, ఎలావుందో అర్ధం చేసుకోవచ్చు. పేటిఎం, వీసా, మాస్టర్ కార్డ్ , ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ తదితర కంపెనీలతో ఏర్పాటుచేసిన ‘‘ఫిన్ టెక్ వ్యాలీ’’కి తూట్లు పొడిచారు. లులూ గ్రూప్, హెచ్ ఎస్ బిసి, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ వంటి కంపెనీలన్నింటినీ బెదిరించి తరిమేశారు..చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెలకొల్పిన ‘‘మెడ్ టెక్ జోన్’’ అభివృద్ధిపై శీతకన్నేశారు. సూదినుంచి, సీటీ స్కానింగ్ యంత్రం దాకా వైద్యపరికరాల తయారీకి వేదికైన మెడ్ టెక్ జోన్ ను గత 4ఏళ్లుగా పట్టించుకున్నవాళ్లు లేరు. కరోనా కల్లోలంలో కూడా ఫేస్ మాస్క్ లు, శానిటైజర్లు, మాస్క్ లు, కొవిడ్ నియంత్రణ పరికరాల తయారీకి దోహదపడ్డ ప్రాజెక్టుకు మరిన్ని నిధులిచ్చి మరింత ప్రోత్సహించాల్సిన పాలకులు ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో 5ఏళ్లలో 3సమ్మిట్ లు, ఫిన్ టెక్ ఫెస్టివల్, బ్లాక్ చెయిన్ కాన్ఫరెన్స్, అగ్రి ఫెస్టివల్ కు వేదికైన విశాఖలో నాలుగేళ్లపాటు ఏ ఒక్క అంతర్జాతీయ సదస్సు పెట్టకుండా, చివర్లో ఎన్నికల ఏడాది ఏదో మొక్కుబడి సమ్మిట్ ఒకటి జరిపి కప్పదాటేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషిని పూర్తిగా నీరుగార్చారు. యువత ఉపాధి అవకాశాలకు పూర్తిగా గండికొట్టారు..
ఏపి పునర్విభజన చట్టం హామీల అమలుకు చేసిన కృషి శూన్యం..25ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్నవాళ్ల మెడలే ఏవిధంగా వంగిపోయాయో ఉత్తరాంధ్ర ప్రజల కళ్లెదుటే ఉంది. విశాఖ రైల్వే జోన్ ఎక్కడవేసిన గొంగళి అక్కడే..3వెనుకబడిన జిల్లాల అభివృద్దికి కేంద్రం నుంచి రావాల్సిన రూ 600కోట్లే కాకుండా పాత బకాయిలను గాలికొదిలేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేక పోయారు. ఎంతో విలువైన 24వేల ఎకరాల భూముల త్యాగం, 32మంది ప్రాణాల త్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడలేకపోవడం జగన్ రెడ్డి ఘోర వైఫల్యమే..ప్రధాని వాజ్ పేయి హయాంలో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతీసుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు రూ 1200కోట్లు తెచ్చి ప్రైవేటీకరణను అడ్డుకోవడం విదితమే..అలాంటిది ఇప్పుడు 22మంది ఎంపిలు లోక్ సభలో, మరో 9మంది రాజ్యసభలో ఉండికూడా కేంద్రంపై జగన్ రెడ్డి ఒత్తిడి తేలేకపోవడాన్ని స్థానికులంతా నిరసిస్తున్నారు. విశాఖ మెట్రో, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ తదితర హామీల అతీగతీలేదు. ఏజెన్సీలో కాఫీతోటల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. ‘‘అరకు కాఫీ’’ ప్రోత్సాహానికి చేసిందేమీ లేదు.
ఎక్కడ చూసినా వైసిసి రౌడీ గ్యాంగుల దందాలు, పులివెందుల పంచాయతీలతో 3జిల్లాల్లో అశాంతి-అభద్రత సృష్టించారు. గాజువాకలో రూ 100కోట్ల భూమిపై కన్నేసి సింబియోసిస్ సీఈవోనే బెదిరించడం తెలిసిందే.. ‘‘సీఎంకు సన్నిహితులం, పులివెందుల నుంచి వచ్చాం’’ అనే బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ కామన్ అయ్యింది..టిడిపి హయాంలో కాపాడిన విలువైన వేల ఎకరాల భూములను గత 4ఏళ్లలోనే కబ్జాలకు పాల్పడ్డారు..రూ 1500కోట్ల విలువైన దసపల్లా భూములను ఆక్రమించారు. ఇన్నాళ్లు కాపాడిన విలువైన భూములను అర్ధరాత్రి రహస్యంగా తనఖాలు పెట్టారు.. రుషికొండకు అరగుండు కొట్టారు, పర్యావరణాన్ని ధ్వంసం చేశారు. ఇళ్లు, భవనాల కూల్చివేతలతో భయభ్రాంతులను చేస్తున్నారు. అన్ని అనుమతులున్నా టిడిపి నాయకుల వాణిజ్య భవనాలను, ఇళ్లను, ప్రహరీగోడలను కూల్చేశారు.. చివరికి గీతం విద్యాసంస్థలను కూడా వదిలిపెట్టకుండా కూల్చివేతలు చేపట్టడం జగన్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట..
ఐటి హబ్ గా రాష్ట్రాన్ని చంద్రబాబు చేస్తే, గంజాయి హబ్ గా మార్చిన ఘనత జగన్ రెడ్డి దే.. ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా, కడప నుంచి బెంగళూరు, చిత్తూరునుంచి తమిళనాడు, కృష్ణా నుంచి తెలంగాణకు, గంజాయి అక్రమ రవాణా ప్రతిరోజూ మామూలైంది. 100గ్రామాల్లో, 15వేల ఎకరాల్లో, రూ 25వేల కోట్ల విలువైన గంజాయి సాగవుతుందంటే ఏ స్థాయిలో ఈ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం ఉందో తెలుస్తోంది. దేశంలో ఎక్కడేమూల గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే కావడం ఆందోళనకరం..గంజాయి కేపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపిని చేశారు.
నాలుగేళ్లుగా ఉత్తరాంధ్రలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకపోగా తగుదునమ్మా అంటూ ఎన్నికల ఏడాదిలో గత ప్రభుత్వం చేసిన శంకుస్థాపనలకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మోసగించడం జగన్మాయే..విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టుకు 2019ఫిబ్రవరి 18న అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పతంజలి ఫుడ్ పార్క్ కు శంకుస్థాపన చేయడం, 172ఎకరాల్లో విజయనగరం మెడికల్ కాలేజీకి, 129ఎకరాల్లో గురజాడ వర్సిటీకి ఆరోజునే ఫౌండేషన్లు వేయడం విదితమే. అలాంటిది గత 4ఏళ్లుగా వాటిని త్వరితగతిన పూర్తిచేసి జాతికి అంకితం చేయకుండా, ఆయా పనులన్నీ ఆపేసి, మళ్లీ ఇప్పుడు శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వ నయవంచనకు తార్కాణం.. 2700ఎకరాల్లో అభివృద్ధి చేయాల్సిన భోగాపురం విమానాశ్రయాన్ని 2200ఎకరాలకు కుదించడం గమనార్హం. 2019లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్ కే మళ్లీ శంకుస్థాపన చేయడం మరో విడ్డూరం. రూ 70వేల కోట్ల డేటా సెంటర్ ను నాలుగేళ్లపాటు నిలిపేసి ఇప్పుడు ఎన్నికల ముందు ఆ ప్రాజెక్టును నాలుగోవంతుకు కుదించడం మరో దగా..
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధిపై వైసిపి ప్రభుత్వం పూర్తిగా శీతకన్ను వేసింది ..ఒక ప్రాజెక్టు పూర్తిచేసింది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు..పేదల ఇళ్ల నిర్మాణాన్ని గాలికొదిలేశారు. తాగునీటి పథకాలను నిర్లక్ష్యం చేశారు..ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి చేసిందేమీ లేదు.
చివరికి ఆధ్యాత్మిక దేవాలయాల్లో కూడా రాజకీయ కక్ష సాధింపునకే పాల్పడటం నీచ రాజకీయం గాక మరేంటి..? ఉత్తరాంధ్ర ప్రజల పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం అభివృద్ధిని నీరు గార్చారు..మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుపై కక్షతో సింహాచలాన్ని కూడా రాజకీయ కక్షసాధింపు వేదికగా చేశారు. పేద విద్యార్ధుల చదువులకు దోహదపడే మాన్సాస్ ట్రస్ట్ పై కక్షగట్టి తూట్లు పొడిచే చర్యలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది..రాజకీయ పగతో ప్రజలపైనే ప్రతీకారేచ్ఛ ప్రదర్శించే పాలకులను ఇప్పుడే చూస్తున్నాం..పోగాలం దాపురించబట్టే ఇటువంటి ప్రజావ్యతిరేక చర్యలకు బరితెగించారు. ఇన్నాళ్లు తామేం కోల్పోయామో అన్నివర్గాల ప్రజలకు అర్ధమైంది, ఎప్పుడెప్పుడు ఈ ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడుదామా అని ఎదురు చూస్తున్నారు.