వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరికొందరు పార్టీ కీలక నేతలు ఇచ్చిన దన్నుతో ఆ పార్టీ శ్రేణులు రెచ్చిపోయిన తీరు ఇంకా తెలుగు ప్రజల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారిపై విరుచుకుపడిపోయిన ఆ శ్రేణులు… ప్రత్యర్థి పార్టీల ముఖ్యనేతలు, వారి కుటుంబ సభ్యులు, చివరకు ఆ కుటుంబాల్లోని బాలికలను టార్గెట్ చేస్తూ చదవడానికే వెగటుగా ఉన్న పోస్టులు పెట్టాయి. చివరాఖరుకు జగన్ సర్కారు తీసుకున్ననిర్ణయాలను తప్పుబట్టారన్న కారణంగా ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులను కూడా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వదలలేదు. ఇప్పుడు వైసీపీ అధికారం నుంచి దిగిపోయింది కదా… కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకీ రాలేదు కదా. అందుకే కాబోలు… కూటమి సర్కారు పెడుతున్న కేసుల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని ఓ గట్టి నిర్ణయానికి వచ్చిన వైసీపీ యాక్టివిస్టులు ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తున్నారు. అందులో భాగంగానే గురువారం సోషల్ మీడియా వేదికగా మాజీ జర్నలిస్టు, నటిగా తనను తాను చెప్పుకునే శ్రీరెడ్డి విడుదల చేసిన ఓ లేఖ వైరల్ గా మారింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకశ్ కు రానిస సదరు లేఖలో శ్రీరెడ్డి… తన తప్పును ఒప్పేసుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉండగా… తనతో పాటుగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసినదంతా ముమ్మాటికీ తప్పేనని కూడా ఆమె ఒప్పుకుంది. తమ తప్పులను పెద్ద మనసుతో క్షమించాలని వేడుకున్న శ్రీరెడ్డి… ఇకపై అలాంటి తప్పులు చేయబోమని వేడుకుంది. రెండు పేజీల దాకా సుదీర్ఘంగా సాగిన ఈ లేఖలో తాను ఏమేం చేశానన్న విషయాన్ని ఆమె అందులో వివరించే యత్నం చేసింది. టీడీపీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, లోకేశ్ లతో పాటు జనసేన అదినేత పవన్ కల్యాణ్… వారి కుటుంబ సభ్యులను కూడా తాను దూషించినట్లుగా ఒప్పుకున్న శ్రీరెడ్డి… ఇకపై అలాంటి తప్పులు చేయబోమని తెలిపింది. అంతేకాకుండా లోకేశ్ ను అన్నా అంటూ సంబోధించిన శ్రీరెడ్డి… చేతులు జోడించి వేడుకుంటున్నాను…ఇక నన్ను వదిలేయండి అంటూ దీనంగా అభ్యర్థించింది.
అసబ్య పదజాలం, మార్ఫింగ్ ఫొటోలతో కూడిన పోస్టులను పెడుతున్న వారిపై కూటమి సర్కారు చర్యలు మొదలుపెట్టిన కొన్ని రోజులకే తన పరిస్థితి ఏమిటన్న దానిపై రియలైజ్ అయిన శ్రీరెడ్డి… ఓ వారం కిందట ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. అందులో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్టుగా ప్రకటించిన శ్రీరెడ్డి… తాను చేసిన తప్పు వల్ల ఎక్కడ తన కుటుంబం ఇబ్బందులపాలు అవుతుందోనన్న భయం తనను పట్టి పీడిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన తప్పులు తన కుటుంబానికి శాపంగా మారకూడదన్న భావనతోనే చంద్రబాబు, లోకేశ్, పవన్ లకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపింది. అంతేకాకుండా తనతో పాటుగా మిమ్మల్ని దూషించిన వైసీపీ నేతలను కూడా పెద్ద మనసుతో క్షమించాలని కూటమి ప్రభుత్వ పెద్దలను ఆమె కోరింది. సోషల్ మీడియాలోనే విడుదలైన ఈ వీడియో పెద్దగా ఫలితం ఇవ్వలేదో, ఏమో తెలియదు గానీ… తాజాగా శ్రీరెడ్డి ఏకంగా లేఖతో ఎంట్రీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే… లోకేశ్ ను ఉద్దేశించి లేఖ రాసిన శ్రీరెడ్డి… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ సందేశాన్ని పంపారు. ఈ సందేశాన్ని కూడా సోషల్ మీడియా వేదికగానే పంపిన శ్రీరెడ్డి… జగనన్నా… సారీ అంటూ పోస్టు పెట్టింది. ఓ వైపు తాను చేసింది తప్పేనని, తనను క్షమించాలని కోరుతూ లోకేశ్ కు లేఖ రాసిన శ్రీరెడ్డి… అందులో మునుపెన్నడూ చూపని వినయం, విధేయత, అపరాధ భావనను ఆమె వ్యక్తం చేసింది. అయితే ఆ వెంటనే జగన్ కు సారి చెబుతూ ఆమె కూటమి సర్కారు పెద్దలకు మరింతగా ఆగ్రహం తెప్పించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ పార్టీ తరఫున తప్పు చేశానని ఒప్పుకున్నశ్రీరెడ్డి… ఇక జగన్ పార్టీకి దూరంగా ఉంటానని ప్రమాణం చేసిన తర్వాత జగన్ కు సారీ చెప్పడం ఎందుకన్న రీతిలో ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఏదేమైనా… క్షమాపణ కోరుతూ శ్రీరెడ్డి వరుసగా చేస్తున్నవినతులకు కూటమి సర్కారు… ప్రత్యేకించి మంత్రి నారా లోకేశ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.