సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రం ఈరోజు విడుదలైంది. ఇంతకుముందు ‘పలాస 1978’ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు కరుణ కుమార్ చేసిన మరో కొత్త ప్రయోగమే ఈ చిత్రం. ఆ ప్రత్యేకతను సినిమా టైటిల్ లోనే చూపించారు. సినిమా ప్రచారాన్ని కూడా విభిన్నంగా చేశారు. పాన్ ఇండియా ప్రభాస్ కూడా ఈ సినిమా మీద ప్రత్యేకమైన ఇంట్రస్ట్ చూపించి చిత్ర యూనిట్ కు సహకరించారు. 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
లైటింగ్ సూరిబాబు (సుధీర్ బాబు) అమలాపురంలో మంచి పేరు. లైటింగ్ పెట్టాలంటే అతన్నే సంప్రదిస్తుంటారు. తన వృత్తిలో ఎదగాలన్నకోరిక ఎవరికైనా ఉంటుంది. అలాగే తను కూడా ఓ షాపు పెట్టి లైఫ్ లో ఎదగాలన్నది అతని కోరిక. శ్రీదేవి(ఆనంది)ది కూడా ఆ ఊరే. ఆమె పేరుతో శ్రేదేవి సోడా సెంటర్ అనే షాపు ఉంది. జాతరలో ఆమెని చూసి ఇష్టపడతాడు సూరిబాబు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. శ్రేదేవి సోడా సెంటర్ ను ఆమె తండ్రి నరేష్ నడుపుతుంటారు.
వీరి ప్రేమ విషయం తెలిసి ఆమె తండ్రి అంగీకరించడు. దానికి కారణం సూరిబాబుది వేరే కులం కావడమే. మరోవిషయం ఏమిటంటే ఆ ఊరి సర్పంచ్ కొడుకు కాశీ (పావెల్ నవగీతన్) కూడా శ్రీదేవినే ఇష్టపడుతుంటాడు. సూరిబాబుది తక్కువ కులం అంటూ అతడిని దూరం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఓ హత్య కేసులో సూరిబాబు ఇరుక్కుని జైలుకెళతాడు. మరి ఈ సమస్యల్నీ పరిష్కారమై ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నదే కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఇది కూడా కలర్ ఫొటో లాంటి కథాంశమే. కాకపోతే కొన్ని సినిమాల్లో మాదిరిగానే ప్రేమకు కులం అడ్డు వస్తుంది. కరుణ కుమార్ పలాస మాదిరిగానే ఈ సినిమా కూడా ఉంటుంది. భావోద్వేగాలను పండించడంలో కరుణ కుమార్ తనదైన శక్తిని ప్రదర్శించలేకపోయారనిపిస్తుంది. కథ ఎలా ఉన్నా కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరోలా ఉండేది. సన్నివేశాల పరంగా జాగ్రత్తలు బాగా తీసుకున్నారు. తక్కువ కులం వాళ్లను ఎలా చూస్తారో చెప్పే ప్రయత్నాన్ని బాగా చేశారు.
హీరో తండ్రిపై మూత్రం పోసే సన్నివేశంలోనే తన సత్తా చూపారు. కథను రక్తి కట్టించడంలో మాత్రం నూటికి నూరు శాతం న్యాయం చేయలేకపోయారు. ప్రేమ వ్యవహారాలు కులం చిచ్చు రేపితే పరిణామాలు ఎలా ఉంటాయో నిజ జీవితంలోనూ చూశాం. ఈ సినిమాకి ఆయువు పట్టు క్లైమాక్స్ అనవచ్చు. కరుణ కుమార్ సినిమాలన్నీ వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంటాయి. సూరిబాబుగా సుధీర్ బాబు బాగా నటించారు. పాత్ర పోషణలో అతను తీసుకున్న ప్రత్యేక శ్రద్ద కనిపిస్తుంది. మాస్ లుక్ లో అతను ఎలా ఉంటాడో ఈ సినిమాలో చూడవచ్చు.
ఆనంది తండ్రిగా నరేష్ పాత్రకు మంచి మార్కులు పడతాయి. ఇలాంటి టిపికల్ పాత్రలను పోషించడంలో నరేష్ నేర్పే వేరు. సినిమా నిడివి కొంత తగ్గి ఉంటే బాగుండేది. ఇలాంటి ప్రేమ కథలకు నిడివి మైనస్ గా మారుతుంది. టెక్నికల్ గా సినిమా బాగుంది. మాటలు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో డైలాగులు పేలాయి. స్క్రేన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది, పావెల్ నవగీతన్, నరేష్, రఘుబాబు, సత్యం రాజేష్, హర్షవర్థన్, సప్తగిరి, రోహిణి తదితరులు.
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: మణి శర్మ
నిర్మాత: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
దర్శకుడు: కరుణ కుమార్
నిర్మాణం: 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్
విడుదల: 27-08-2021
ఒక్క మాటలో: సోడాలో గ్యాస్ సరిపోలేదు
రేటింగ్: 2.5/5











