ఏపీలో ఇటీవలే ముగిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏ మేర తన కండబలాన్ని చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ కండబలాన్ని తుత్తునీయలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మునిసిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఏపీలో దాదాపుగా అన్ని మునిసిపాలిటీలను గెలుచుకున్న వైసీపీ..ఒక్క తాడిపత్రిలో మాత్రం గెలవలేక ఓటమిపాలైంది. ఎన్నికల ఫలితాల్లో తాడిపత్రి ప్రజలు వైసీపీకి ఓడించినా.. తనదైన శైలి కుయుక్తులతో తాడిపత్రి మునిసిపాలిటినీ కైవసం చేసుకోవాలన్న వైసీపీ జిత్తులను జేసీ ప్రభాకర్ రెడ్డి చిత్తు చేశారు. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా పదవీ బాధ్యతలను చేపట్టిన ఆయన.. తాజాగా అక్కడే వైసీపీకి మరో ఓటమిని కూడా రుచి చూపించారు. తాడిపత్రి మునిసిపాలిటీ చేతికందకపోయినా.. అందులో కనీసం కో-ఆప్షన్ పదవిని దక్కించుకునేందుకు వైసీపీ తనదైన శైలి వ్యూహాలను అమలు చేయగా.. ఈ తరహా వ్యూహాలను ఎలా తుత్తునీయలు చేయాలన్న విషయంపై బాగానే అవగాహన ఉన్న జేసీ.. తన ఇలాకాలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గానికి చుక్కలు చూపించారు.
టీడీపీ ఖాతాలో కో-ఆప్షన్
తాడిపత్రి మునిసిపాలిటిలో శుక్రవారం నాడు కో-ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైపోయింది. మునిసిపాలిటీ చైర్మన్ హోదాలో జేసీ ప్రభాకర్ రెడ్డే ఈ ఎన్నికకు రంగం సిద్ధం చేశారు. అయితే అప్పటికే రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలను గెలుచుకున్న తాము.. చేతికందకుండా పోయిన తాడిపత్రి మునిసిపాలిటీ కో-ఆప్షన్ పదవిని అయినా దక్కించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్లాన్ వేశారు. ఎలాగూ తమ పార్టీ తరఫున గెలిచిన 16మ మంది కౌన్సిలర్లు, రెండు ఎక్స్ అఫీషియో ఓట్లతో పాటు సీపీఐ, ఇండిపెండెంట్ లను కలుపుకుంటే.. 36 మంది సభ్యులున్న సభలో తమదే గెలుపు అని పెద్దారెడ్డి భావించారు. అయితే స్థానిక ఎన్నికల సందర్భంగా 36 సీట్లున్న తాడిపత్రి మునిసిపాలిటీలో టీడీపీ ఏకంగా 18 స్థానాలను దక్కించుకోగా.. వైసీపీకి 16 సీట్లు వచ్చాయి. ఎక్స్ అఫీషియో కోటా కింద ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు కలుపుకుంటే వైసీపీ బలం 18కి చేరింది. అయితే రెండు వార్డుల్లో ఓ వార్డును సీపీఐ, మరో వార్డును ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. వీరిద్దరూ జేసీకే మద్దతు పలకడంతో మునిసిపాలిటీ టీడీపీ కైవసం కాగా.. జేసీ చైర్మన్ అయ్యారు. అయితే ఇప్పుడు కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నికలో సీపీఐ, ఇండిపెండెంట్ లను తమవైపు తిప్పుకోవాలని పెద్దారెడ్డి ప్లాన్ వేస్తే.. ఆ ప్లాన్ ను తిప్పికొడుతూ టీడీపీ సభ్యులతో పాటు సీపీఐ, ఇండిపెండెంట్ సభ్యులను తన క్యాంప్ నకు తరలించిన జేసీ.. కో-ఆప్షన్ ను కూడా ఈజీగా కైవసం చేసుకున్నారు. వెరసి తాడిపత్రిలో వైసీపీకి వరుసగా ఆయన రెండో ఓటమిని చవిచూపించారు.
Must Read ;- వైసీపీ పక్కచూపులు.. సిట్టింగుల తలరాత ఏమిటో?










