కేంద్రం.. విశాఖ ఉక్కు విషయంలో తన మొండి వైఖరిని మరోసారి ప్రదర్శిస్తోంది. ప్రజలతోనూ.. వారి నిరసనలతోనూ అసలు పనిలేదన్నట్లు వ్యవహరిస్తోంది. ఓ వైపు ఢిల్లీలో రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెలల పైబడి సాగిస్తున్న ఉద్యమాన్ని ఏమాత్రం పట్టించుకోని కేంద్రం.. ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా.. కార్మికులను మరింత రెచ్చగొట్టే విధంగా.. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది.
కమిటీ వేసిన కేంద్రం
విశాఖ ఉక్కు విక్రయంపై వివిధ మంత్రిత్వ శాఖలతో కేంద్రం ప్రత్యేక బృందాన్ని (ఇంటర్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆన్ స్ట్రాటజిక్ సేల్ ఆఫ్ విశాఖ స్టీల్ ప్లాంట్) నియమించింది. ఈ కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయ విధి విధానాలను రూపొందిస్తుంది. కర్మాగారానికి ధర నిర్ణయిస్తుంది. లీడ్ బ్యాంకర్ గా ఎవరిని నియమించాలో పరిశీలిస్తుంది. ఈ మొత్తం అంశాలపై అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ కమిటీలో కేంద్ర ఆర్థిక, పరిశ్రమల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు.
వీరికి స్థానికంగా సహకరించేందుకు విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన ఇద్దరు ముఖ్యమైన అధికారులను కూడా కమిటీలో చేర్చారు. ఉక్కు కర్మాగారం విక్రయానికి ఉన్న అవాంతరాలను తొలగించి ‘మార్గం’ సుగమం చేయడంపై ఈ కమిటీ కీలక సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ శాఖ కూడా ఈ కమిటీతో కలిసి పనిచేయనుంది. దీంతో.. విశాఖ ఉక్కు విక్రయం దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసినట్లయింది.
కాదంటూనే.. ముందుకు!
‘విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని ఎవరు చెప్పారు? కేంద్రమంత్రి చేసిన ఒక్క ట్వీట్ ను పట్టుకుని ప్రతిపక్షాలు ఇంత రాద్దాంతం చేస్తున్నాయి. కేంద్రమంత్రులతో మాట్లాడాం. ప్రైవేటీకరణ జరగదు’’ ఇవీ.. ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్న మాటలు. కానీ, కేంద్రంలోని అదే పార్టీ ప్రభుత్వం మాత్రం ఉక్కు విక్రయంపై ముందుకే వెళుతుండడం గమనార్హం. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని… తమ వినతిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు చెబుతూ వస్తుండగా.. వారికి ఝలక్ ఇస్తూ.. ఇప్పుడు కేంద్రం ‘ఉక్కు’ విక్రయంపై ఏకంగా ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మరి ఈ పరిణామంపై రాష్ట్ర బీజేపీ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Must Read ;- ఢిల్లీకి సెగ తాకేలా.. విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రతరం