మాజీ మంత్రి వై.ఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్..వైసీపీ నేతలకు ఎదురుతిరుగుతున్నారు. నిజానికి గతంలో ఆయన వైసీపీ నేతలకు విధేయుడిగా ఉన్నారు. కానీ జైలు నుంచి విడుదలైన తర్వాత వారికే వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. తనతోపాటు తన తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న వారి బండారం బయటపెడతానంటూ వార్నింగ్ ఇస్తున్నారు. వారి కోసం తాను 39 నెలలపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నానని, ఆ సమయంలో తన తండ్రిని సైతం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శనివారం తెల్లవారుజామున తన తల్లితో కలిసి పులివెందుల పీఎస్‌లో వైసీపీ నేతల తీరుపై డీఎస్పీ మురళీ నాయక్‌కు ఫిర్యాదు చేశారు సునీల్ యాదవ్. వివేకా హత్య నేపథ్యంలో రూపొందించిన హత్య సినిమాలో తనను, తన తల్లిని అవమానించేలా సన్నివేశాలు చిత్రీకరించారంటూ సునీల్ యాదవ్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశంపై మూడు రోజుల కిందట కడపలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శనివారం వేకువజామున కేసు నమోదు చేశారు.
హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితలను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ చిత్రంలోని సన్నివేశాలను వైఎస్ అవినాష్‌రెడ్డి అన్న యూత్ పేరుతో ఉన్న వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి, వైరల్ చేసినట్లు సునీల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆ వాట్సప్ గ్రూప్ అడ్మిన్ పవన్‌కుమార్‌ను కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. వైసీపీ కడప సోషల్ మీడియా వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. వీరితోపాటు మరికొందరిని నిందితులుగా చేరుస్తూ..కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పవన్‌కుమార్‌ను పోలీసులు మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. కడప సైబర్ క్రైమ్ స్టేషన్‌లో విచారించిన అనంతరం పులివెందుల తరలించారు.