వైవిధ్యమైన సినిమాలు ఎంచుకోవడంలో చియాన్ విక్రమ్ దిట్ట . ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి ప్రేక్షకులను మెప్పించే టాలెంట్ అతడిది. ఆయన ప్రస్తుతం ‘డిమోంటి కాలనీ’ ఫేమ్ అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో ‘కోబ్రా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, 7 స్క్రీన్ స్టూడియోస్, వయాకామ్ 18 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు.
ఈ సినిమాలో ఇర్ఫాన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ రోజు ఇర్ఫాన్ పుట్టినరోజు సందర్భంగా ‘కోబ్రా’ సినిమా నుండి ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఇర్ఫాన్ పఠాన్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ‘మీలాంటి మంచి మనిషితో పని చేయడం చాలా ఆనందంగా ఉందని, మీరు మీ జీవితంలో మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న’ అని ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ ట్విట్ చేసాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇర్ఫాన్ పఠాన్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
‘కోబ్రా’ సినిమా ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో విక్రమ్ ఏడు పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఇర్ఫాన్ పఠాన్ తో పాటుగా సర్జానో, కేఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై హీరో విక్రమ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కూడా విక్రమ్ మరో వైవిధ్యమైన పాత్రను చేయడమే ఇందుకు కారణం. ‘కోబ్రా’ సినిమాను తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘కోబ్రా’ చిత్రం ద్వారా విక్రమ్ తన అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి మరి.










