యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే.. కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను కమిట్ అవుతున్న విషయమూ విదితమే. ఈ క్రమంలో తారక్ అభిమానులు ఈ రెండు సినిమాలకు సంబంధించిన పెద్ద సర్ ప్రైజులే ఎక్స్పెక్ట్ చేస్తున్నారిప్పుడు. దానికి కారణం రేపు యన్టీఆర్ పుట్టినరోజు. తాత నందమూరి తారక రామారావు జన్మించిన నెలలోనే తానూ జన్మించడం యాదృచ్ఛికమే అయినా.. అభిమానులు రెండు పండుగల్లా భావిస్తారు.
అయితే గత ఏడాది తారక్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు కరోనా బ్రేకులేసింది. పుట్టినరోజు వేడుకలు అభిమానులందరూ కలిసి జరుపుకొనే అవకాశాలు లేకుండా పోయాయి. సరిగ్గా ఈ ఏడాది కూడా అదే పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సెకండ్ వేవ్ కాస్తంత ప్రమాదకరంగా మారడమే కాకుండా.. తాను కూడా కరోనా బారిన పడడంతో ..తారక్ తన అభిమానుల్ని ఉద్దేశిస్తూ .. సోషల్ మీడియా వేదికగా ఒక విన్నపం చేసుకున్నాడు.
నా అభిమానులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత కొద్దిరోజులుగా మీరు సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశిస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తిగా కోలుకొని కోవిడ్ ను జయిస్తానని ఆశిస్తున్నాను. ప్రతీ ఏటా మీరు నా పుట్టినరోజు నాడు చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఆశీర్వచనంలా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మీరు ఇంటిపట్టునే ఉంటూ.. లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ నియమాల్ని పాటిస్తూ, జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు నాకు అందించే అతి పెద్ద కానుక.
ఇది వేడుకలు చేసుకొనే సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మన సంఘీభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాల్ని, జీవనోపాధినీ కోల్పోయారు. ఆ కుటుంబాలకు కుదిరితే అండగా నిలబడాలి. మీ కుటుంబాల్ని జాగ్రత్తగా చూసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ చేతనైనంత ఉపకారం చేయండి. త్వరలోనే ఈ దేశం కరోనాని జయిస్తుందని నమ్ముతున్నాను. ఆ రోజున అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకూ మాస్క ధరించండి, జాగ్రత్తగా ఉండండి. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ.. మీ నందమూరి తారకరామారావు .. అని తెలిపారు.
Must Read ;- తన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చిన తారక్
A humble appeal 🙏🏻 pic.twitter.com/vzEtODgtEf
— Jr NTR (@tarak9999) May 19, 2021