(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి గత ఎన్నికల వరకూ ఆ పార్టీకి విజయనగరం కంచుకోటగా నిలిచింది. ఆ పార్టీ నేతల స్వయంకృతాపరాధంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ డక్ అవుట్ అవ్వగా, వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జిల్లాకు అనుబంధంగా ఉన్న విజయనగరం, శ్రీకాకుళం, అరకు పార్లమెంటు నియోజకవర్గాలనూ వైసీపీ కైవసం చేసుకుంది. రాజకీయ ఉద్దండులు అశోక్ గజపతిరాజు, సుజయ కృష్ణ రంగారావు లాంటి వారు కూడా ఇంటి దారి పట్టారు. విజయనగరం జిల్లాలో సామాజిక పరంగా పట్టున్న బీసీలను నిర్లక్ష్యం చేస్తూ రాజులకు పెద్దపీట వేస్తుండటమే ఇందుకు కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించినట్లు ఉన్నారు. అందుకోసమే జరిగిన తప్పులు సరిదిద్దే యత్నం చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు బాహాటంగా అభిప్రాయపడుతున్నాయి.
భారీ మూల్యం ..
విజయనగరం జిల్లాలో బీసీలను విస్మరించడంతో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకున్నట్లు ఆ పార్టీ అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలను కిమిడి నాగార్జునకు చంద్రబాబు అప్పగించారు. బీసీనేత కావడం వల్లే నాగార్జునకు ఈ పదవిని చంద్రబాబు కట్టబెట్టారని తెలుస్తోంది. రాజుల ఆధిపత్యం నుంచి పక్కకు తప్పించేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు మహిళా ఇన్‌ఛార్జి బాధ్యతలను మరో బీసీ నేత, మాజీ నెల్లిమర్ల ఎంపిపి అయిన సువ్వాడ వనజాక్షికి అప్పగించారు. ఇలా రెండు పోస్టులు బీసీలకు అప్పగించి చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
అసంతృప్తులు ఉన్నప్పటికీ..
ఈ సందర్భంగా కొంత అసంతృప్తులు తలెత్తే అవకాశమున్నా చంద్రబాబు మాత్రం బీసీల వైపే మొగ్గు చూపడం ఆసక్తి రేపుతోంది. అదే తరుణంలో గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ. నాయుడు పార్లమెంటరీ ఇన్‌ఛార్జి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆ పదవి ఆయనకు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నప్పటికీ, పార్టీ నిర్ణయాన్ని కాదనలేరనేది అధిష్టానం ధృడ విశ్వాసంగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా అధిష్టానం నిర్ణయంతో అవాక్కయ్యారని వినికిడి. గత ఎన్నికల్లోనే మీసాల గీతకు విజయనగరం టిక్కెట్‌ను టీడీపీ అధిష్టానం ఇవ్వలేదు. అశోక్ కుమార్తె ఆదితికి ఇచ్చారు. దీంతో మీసాల గీత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమెకు కూడా ఏదో ఒక పదవి ఇచ్చే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారని, ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూరోలో గతంలో ఎన్నడూ లేని విధంగా విజయనగరం నుండి గుమ్మడి సంధ్యారాణిని నియమించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవన్నీ దిద్దుబాటు చర్యలేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అదే తరుణంలో ఇప్పటికైనా సమష్టిగా పార్టీ నేతలు కృషి చేస్తే పూర్వవైభవం తిరిగి పొందే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏమో .. ఎలావుంటుందో.. వేచి చూడాలి.











