రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో 40 వ ఆవిర్భావ వేడుకల లోగోను పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయన ఆవిష్కరించారు. తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగుపెడుతుండడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.టిడిపి ఆవిర్భావంతోనే దేశంలో తెలుగు వారికి ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్న ఆయన, నాడు టిడిపి ప్రభుత్వం అమలు చేసిన పధకాలే నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయని తెలిపారు.
టిడిపి వచ్చాకే వెనుకబడిన వర్గాలకు రాజకీయ గుర్తింపు వచ్చిందన్న చంద్రబాబు.. రాష్ట్రంలో అనేక సామాజిక మార్పులకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కారణమయ్యిందని అన్నారు.తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిందని..పార్లమెంటులో సైతం టిడిపి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన సంగతి ఆయన గుర్తుచేశారు.
తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలని ఆయన తెలిపారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించాలని క్యాడర్ కు చంద్రబాబు సూచించారు. అదేసమయంలో ఆవిర్భావ దినోత్సవం నాడు గ్రామ గ్రామాన టీడీపీ జెండా ఆవిష్కరణలు, బైక్ ర్యాలీ చేపట్టాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు.
ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాడు ఎన్టీఆర్ పార్టీ స్థాపన ప్రకటించిన హైదరాబాదులోని ఎమ్మెల్యేల క్వార్టర్స్ ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు.అనంతరం ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించి.. ఎన్టీఆర్ భవన్ లో జరగబోయే కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నట్లు వెల్లడించారు.