తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై రాళ్లదాడి ఘటనపై టీడీపీ ఎంపీలు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. లోక్‌సభ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంధ్రబాబు కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర బలగాలతో తిరుపతి ఉప ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ ఎంపీలు సీఈసీని కోరారు.
ఓటమి భయంతోనే..
టీడీపీ అధినేత చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్నా తిరుపతి సభలో రాళ్ల దాడి చేయడం దారుణమని టీడీపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. ఏపీ పోలీసులు వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని, కేంద్ర బలగాలను దించి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలని వారు సీఈసీని కోరారు. ప్రజల సొమ్ముతో వాలంటీర్లకు జీతాలు చెల్లిస్తూ, తిరుపతి ఉప ఎన్నికల్లో వారిని ఉపయోగించుకుంటున్నారని టీడీపీ ఎంపీలు సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వైసీపీ నాయకులు వాలంటీర్లతో నిర్వహించిన సమావేశాల వీడియోలు, ఫోటోలను సీఈసీకి సమర్పించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీలు విజ్ఙప్తి చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎంపీలు అభిప్రాయపడ్డారు.
Must Read ;- అలిపిరి ఘటనకే భయపడలేదు, రాళ్ల దాడికి భయపడతానా? : చంద్రబాబు నాయుడు