ఎడిటర్ మోహన్ అంటేనే సినిమా నాడి తెలిసిన నిర్మాత అంటారు. ఆయన తీసిన ప్రతి సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మెగాస్టార్ చిరంజీవితో ‘హిట్లర్’ సినిమా తీశారుగానీ నిజానికి ఆ మాట ఎడిటర్ మోహన్ కే వర్తిస్తుంది. ఎందుకంటే హిట్లర్ అంటే ఆయనే.. ఎన్నో హిట్లు కొట్టారు కాబట్టి హిట్లర్ అనాల్సిందే. అలాంటి ఎడిటర్ మోహన్ కు ఓ సమస్య వచ్చి పడింది. అదే ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాకి పేరు పెట్టడం. జనాన్ని అంతలా నవ్వించిన సినిమా మరొకటి లేదు.
ఈ సినిమా విడుదలై ఇప్పటికి 21 ఏళ్లు పూర్తయింది. ఇందులో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రలు పోషించారు. రాజా వన్నెంరెడ్డి దీనికి దర్వకులు. సినిమా తీయడం ఈజీనే.. కానీ పేరు పెట్టాలంటే మాత్రం ఒక్కోసారి తలప్రాణం తోకకు వస్తుందనడానికి ఈ సినిమానే ఓ ఉదాహరణ. సాధారణంగా ఎడిటర్ మోహన్ తను ఏ సినిమా తీసినా ముందే పేరు పెట్టేస్తుంటారు.. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఏం పేరు పెట్టాలో పాలుపోలేదు. అప్పటికే సినిమా పూర్తయిపోయింది.

ఏం పేరు పెట్టాలా అని ఎడిటర్ మోహన్ ఆలోచిస్తూ కూర్చున్న తరుణంలో సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ వచ్చారు. ‘ఏంటి సార్ ఇంకా టైటిల్ పెట్టలేదు?’ అన్నారు. ‘ఔనయ్యా.. ఏదైనా మంచి టైటిల్ పెట్టాలి కదా.. ఏమీ తోచడం లేదు’ అన్నారట ‘అది కాదండీ.. మీరేమీ అనుకోకపోతే మీరు పూజ రోజు ఫస్ట్ షాట్ తీశారు కదా.. ఆ షాట్ లో రోజా క్షేమంగా వెళ్లి లాభంగా రండి అనే డైలాగ్ చెబుతుంది కదా.. అది చాలా బాగుంటుంది కదండీ’ అన్నారు వందేమాతరం శ్రీనివాస్. ‘అవును కదా.. ఇది మంచి టైటిల్ కదా’ అనేశారట
ఎడిటర్ మోహన్. అలా ఈ సినిమా టైటిల్ పుట్టింది. మంచి ఎవరు చెప్పినా తీసుకునే తత్వం ఎడిటర్ మోహన్ ది. అసలు ఈ సినిమా మొదట తమిళంలో రూపొందింది. ‘విరాటుక్కేత్త వేక్కమ్’ అనే టైటిల్ తో తమిళంలో రూపొందింది. దీనికి ‘వేళ్లకు తగిన వాపు’ అని అర్థం. తనకు నచ్చిన సినిమా హక్కులు కొని జనం మెచ్చేలా తీసే నిర్మాతగా ఎడిటర్ మోహన్ కు పేరుంది. ఆయన కుమారుడు జయం రాజా ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘లూసీఫర్’ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నారు. మరో కుమారుడు జయం రవి తమిళంలో హీరో.
Must Read ;- నటన, రాజకీయంలో ‘జయప్రద’మైన జీవితం











