తెలంగాణలో బీజేపీ నేతల ఆందోళనలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వేలాది మంది రోడ్లపైకి వస్తుండటంతో ఎప్పుడు,ఎక్కడ , ఎలాంటి అందోళన చేస్తారో అని పోలీసులు కలవర పడుతున్నారు. గత నెల రోజులుగా బీజేపీ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేశారు. బండి సంజయ్ ఆదేశాలతో ఎక్కడికక్కడ కార్యకర్తలను మొబిలైజ్ చేసుకుని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనీసం మీడియాకు కూడా సమావేశం ఇవ్వకుండా ఈ కార్యక్రమాలు చేపడుతుండటంతో విషయం ఎక్కడా బయటకు పొక్కడం లేదు. బండి సంజయ్ సైతం ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరికి ఇచ్చిన బాధ్యత వారు నెరవేర్చాలి.. ఎక్కడా సమాచారం లీక్ కావద్దంటూ స్పష్టమైన ఆదేశాలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం స్కెచ్ అమలు చేస్తుండటంతో పోలీసులకు కొత్త తల నొప్పులు ప్రారంభమయ్యాయి.
తలలు పట్టుకుంటున్న పోలీసులు..
బీజేపీ ఆందోళన కార్యక్రమాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థపైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం ప్రతి పార్టీ కార్యాలయంలో ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌ను కూడా నియమిస్తుంది. తనకు అందిన సమాచారాన్ని పోలీస్ పెద్దలకు తెలియ జేయడం వారి వృత్తి . అయితే బండి సంజయ్ అధ్యక్ష పదవి చేపట్టే వరకు పరిస్థితి ఎలా ఉన్నా ఆయన అధ్యక్షుడు అయ్యాక వారికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి . పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఎవరూ వారికి చెప్పక పోవడంతో పాటు , ఎవరు ఎక్కడ ఉంటున్నారో, ఏ బాధ్యతలు ఎవరికి అప్పజెప్పారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పక్కా ప్లాన్ ప్రకారం ఎక్కడా లీకేజీలు లేకుండా కార్యక్రమాలు చేపడుతుండటంతో చివరి నిమిషం వరకు బీజేపీలో జరుగుతున్న విషయాలు పోలీసులకు తెలియడం లేదు. ఒక్కసారిగా రోడ్లపై బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తూ కనిపిస్తుండటంతో ప్రభుత్వ పెద్దల నుండి పోలీసులపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది.
కొత్త కార్యవర్గంతో మరిన్ని ఇబ్బందులు..
బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ వచ్చిన తరువాత కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా అధ్యక్షుల నుండి క్షేత్ర స్థాయి వరకు పాత వారికి పెద్దగా బాధ్యతలు అప్పగించడం లేదు. గతంలో ఉన్న కార్యవర్గంతో పాలీసులు చెట్టాపట్టాలేసుకుని తిరిగే వారు. ఏ కార్యక్రమం చేపట్టినా వెంటనే పోలీసులకు ఉప్పందేది. దీంతో ఆ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ముందస్తుగానే పోలీసులు అలర్ట్ అయ్యే వారు. ఇప్పుడు కొత్త కార్యవర్గం పోలీసు విభాగంతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. సంజయ్ సైతం ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. తామ చేపట్టే కార్యక్రమం వివరాలు ఎక్కడా బయటకు పొక్కడానికి వీళ్ళేదని, ఎవరైనా అలా చేస్తే ఇక ఊరుకునేది లేదని పార్టీ కేడర్ ను హెచ్చరించినట్టు తెలుస్తోంది. సంజయ్ నిర్ణయంతో పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో భవిష్యత్‌లో కూడా ఇదే తరహా స్ట్రాటజీని కొనసాగించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇక తాజాగా కేటీఆర్ సైతం బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, అవసరమయితే ఫైరింగ్ కూడా చేయించుకుని సానుభూతి పొందాలని చూస్తోందంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. దీంతో ఆ మురసటి రోజే ముఖ్యమైన కార్యాలయాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మొత్తానికి బీజేపీ కొత్త స్ట్రాటజీతో రాష్ట్రంలో ఏ మేరకు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్తుంది.. ప్రజల ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి.