తమిళనాడును కోలుకోలేని దెబ్బతీసిన నివర్ తుపాను క్రమంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే రాయలసీమలో భారీ వర్షాల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టం వాటిల్లింది. కడపలో వాగులు పొంగి పొర్లడంతో పట్టణం పూర్తిగా మునిగి పోయింది. ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమయ్యింది. పంటలు కోసే సమయం కావడంతో అధికారులతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. పంట నష్టం ఎక్కువ జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాన్ని క్షేత్ర స్థాయికి పంపింది.
కోసిన పంటను జాగ్రత్తగా కాపాడుకోండి
తెలంగాణలో తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేస్తున్నారు . కోసిన పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలంటూ సూచిస్తున్నారు. ఇప్పటికే కోసిన పంటను ఆరబెట్టిన వారు వాటిని సంచుల్లో ఎత్తుకోవాలని చెపుతున్నారు. ఇప్పడిప్పుడే ఆరబోసిన ధాన్యం ఏమైనా ఉంటే ప్లాస్టిక్ కవర్లతో జాగ్రత్తగా కప్పి ఉంచుకోవాలని ప్రకటిస్తున్నారు. ఇక రైతులను మరింత అప్రమత్తం చేసేందుకు గ్రామాల్లో టాంటాంలు వేయిస్తూ చెప్పిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వాన పాలు చేయవద్దని .. మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మార్కెట్‌కు ధాన్యం తేవొద్దు : అధికారులు
నివర్ తుపాను నేపథ్యంలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని మార్కెట్‌కు తేవద్దని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా కొనుగోళ్ళు పెద్దగా ఉండకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు. దీంతో మార్కెట్‌కు వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచిస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న రైతులు .. ఇప్పుడు తుపానుతో మరింత నష్ట పోకుండా ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అయితే ఇప్పటికే ధాన్యం కోసి అమ్మకానికి సిద్ధంగా ఉంచుకున్న రైతులు.. తుపానుతో మరిన్ని రోజులు ఎలా కాపాడుకోవాలన్న ఆందోళనలో ఉన్నారు.
Must Read ;- ఖర్చు ప్రభుత్వానిది.. పాలు అముల్ డెయిరీకి











