తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం నుంచి శనివారం వరకు నమోదయిన కేసులను ఆదివారం ఉదయం ప్రకటించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన గణాంకాల మేరకు గడచిన 24 గంటల్లో 51,623 మంది నమూనాలను పరీక్షించగా, 1,949 మందికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,99,276కు చేరుకుంది. కరోనాతో తాజాగా 10 మంది మరణించారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,163కు చేరింది. ఈ వ్యాధి నుంచి 2,366 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,70,212కు చేరింది.
రాష్ట్రంలో 27,901 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 22,816 మంది హోమ్ ఐసోలేషన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా 51,623 మంది నమూనాలను పరీక్షించగా మొత్తం పరీక్షల సంఖ్య 32 లక్షలకు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 291 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 156, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 150 కేసులు నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనా కలకలం రేపుతున్నా ప్రభుత్వం అన్ లాక్ లకు అనుమతి ఇస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.











