తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించిన తర్వాత ఇక సీఎం పేరును ప్రకటించడం కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. అత్యంత జనాదరణ కలిగిన రేవంత్ రెడ్డి పేరునే అధిష్ఠానం మొదటి నుంచి పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే కోరుకుంటున్నారు. సీఎం కుర్చీ కోసం దాదాపు రేవంత్ రెడ్డి పేరే ఫైనల్ అవుతున్నందున, ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఆయనకు కలిసొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబుకు తెలంగాణలో ఉన్న బలగం రేవంత్ కు బాగా ప్లస్ అవ్వనుంది.
పదేళ్ల క్రితం రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు పూర్తిగా ఏపీ రాజకీయాలకే పరిమితం అయినప్పటికీ ఆయనకు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా ఆదరణ తగ్గలేదు. తెలంగాణ ప్రాంతం వారే కాక ముఖ్యంగా ఈ ప్రాంతంలో స్థిరపడ్డ ఆంధ్రా ప్రాంతం వారిలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. అప్పట్లో చంద్రబాబు విధానాలకు మెచ్చి టీడీపీని అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. మొన్న చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత హైదరాబాద్‌లో, తెలంగాణలోని కొన్ని చోట్ల జరిగిన నిరసనలను బట్టే దీన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి చంద్రబాబును అభిమానించే వర్గం వారిలో అందరూ తెలంగాణలో కాంగ్రెస్ కు మళ్లారు. వీరిలో పలుకుబడిదారులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు.
ఆంధ్రాలో వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డ పెద్ద పెద్ద బిజెనెస్‌మేన్లు ఉన్నారు. తెలంగాణకు చెందిన చంద్రబాబు మాజీ అనుచరులు కూడా ఉన్నారు. అయితే, వారందరి నుంచి రేవంత్ రెడ్డికి సంపూర్ణమైన మద్దతు లభించనుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కొత్తలో ఇలాంటి వారిలో కాస్త అభద్రతా భావం ఉండేది. కానీ, రాజకీయాలతో సంబంధం ఉన్న నేతలను, పారిశ్రామిక వేత్తలను లొంగదీసుకొని అప్పటి టీఆర్ఎస్ వారిని తమ దారికి తెచ్చుకుంది. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయితే వారు తమ సంపూర్ణమైన మద్దతు ఆయనకే ఇవ్వనున్నారు. పైగా వారికి స్వేచ్ఛ కూడా లభించనుంది.
ఇటు మీడియా రంగంలో కూడా ప్రస్తుతం అగ్ర స్థానంలో కొనసాగుతున్న సంస్థలు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ కు బాగా సపోర్ట్ చేశాయి. ఏపీలో చంద్రబాబు విధానాలు, పాలన మెచ్చి, ఆయనకు మద్దతు పలికే దాదాపు సంస్థలు అన్నీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే ప్రాధాన్యం ఇచ్చాయి. కొన్ని ఛానెళ్లు, పత్రికలు బీఆర్ఎస్ ను ఎండగడుతూ రేవంత్ కు పూర్తి సహకారం అందించగా, మరికొన్ని గులాబి పార్టీపై న్యూట్రల్ గా ఉంటూ రేవంత్ ప్రచార కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం కల్పించాయి. రేపు రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ వర్గాల నుంచి రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు లభించే అవకాశం ఉంది.