ఆషాడమాసము..తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల.ఈ నెలలోనే పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వస్తాడు.అంతేకాదు ఈ మాసంలోనే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు.అప్పటి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. అంతేకాకుండా తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో బోనాలు పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. కానీ పండితుల ఉవాచ ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదు.చాలామంది ఆషాడం అంటే చెడు దినాలుగా భావిస్తుంటారు.ఈ కారణంగానే ఈ నెలలో పెద్దగా శుభకార్యాలు జరగవు. కానీ ఈ ఆషాడ మాసానికి ఎంతో విశిష్టత ఉంది..
ప్రధానంగా ఆషాడానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆషాడం అనే పదం.. ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాడ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది అనేది పురాణాల నుంచి తెలుపబడింది.ఇక ఆషాడ మాసం పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవలకు చాలా శుభప్రదం. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు.అదేవిధంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమిగా, మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును వ్యాసపౌర్ణమి వ్యవహరిస్తారు.ఇక అధిక ఆషాఢమాసము వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాధ ఆలయంలోని మూలవిరాట్టుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్నే ‘నవకళేబర ఉత్సవం’ అంటారు.
అయితే ఈ మాసంలో పండితులు పూజా కార్యక్రమాల్లో నిగమ్నమై బిజీగా ఉండడం వల్ల వారికి వివాహాలు జరిపించడానికి సమయం ఉండదు. ఈ కారణం వల్లే ఆషాడ మాసంలో వివాహాలు నిర్వహించరు అని కొందరి అభిప్రాయం.ఇక హిందూ సాంప్రదాయాన్ని ఆచరించే వారు ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో వివాహాలు జరిపించరు. అవసరమైతే మూడు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు. అలాగే ఆషాడ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది. అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు. ఆషాడ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సయంలో గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరుగుతుంది. దీంతో తల్లీ, బిడ్డలకు అనారోగ్య సమస్యలు, రోగాలు వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారని చెబుతుంటారు.అంతేకాదు వేసవిలో జరిగే సాధారణ ప్రసవం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయట.. ప్రసవానంతరం మహిళలలకు రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం ఆశుపత్రులలో సరైన వైద్యం అందేది కాదు కాబట్టి.. ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్లని చెప్పుకుంటుంటారు.
ఇక ఈ మాసంలో ఆడవారు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకుంటారు.అలాగే ఆహారంలో మునగకాయను రెగ్యులర్ గా వాడాలంటారు.తెలుగునాట తొలి ఏకాదశి అయిన మహా ఏకాదశి నాడు పేలపిండి తింటారు.ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ జీవితాన్ని గడపటం కోసం పూజలు, వ్రతాలుతో, నవ దంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతుంటారు.అందుకే ఆషాఢమాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మనదేశంలోని హైందవేతర మతస్తులు కూడా కొన్నిచోట్ల పాటిస్తుంటారు.