దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ‘పెళ్ళిసందడి’ సినిమా ఏ రేంజ్ హిట్టయిందో తెలిసిందే. చక్కటి కథ, కీరవాణి వీనుల విందైన సంగీతం అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీప్తి భట్నాగర్ గ్లామర్, రవళి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమాను వీక్షించే ప్రేక్షకులున్నారు. అలాంటి ఈ సినిమా టైటిల్ తో మరోసారి రాఘవేంద్రరావు తన మ్యాజిక్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా టైటిల్ లో ‘పెళ్ళిసందD’ అంటూ చివర ఒక ఇంగ్లీష్ లెటర్ తగిలించారు.
నిజానికి ఈ సినిమా అప్పటి పెళ్ళిసందడికి సీక్వెల్ అయితే.. ‘పెళ్ళి సందడి 2’ అని టైటిల్ పెట్టుకోవచ్చు. కానీ అలా కాకుండా.. దర్శకుడు ‘పెళ్ళిసందD’ అంటూ తమాషా చేస్తున్నారంటే.. సినిమాలో ‘D’ అనే పదానికి ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుందో అర్ధమవుతుంది. ఈ సినిమాకి అదే హైలైట్ పాయింట్ అంటున్నారు. అప్పటి పెళ్ళిసందడి తరహాలోనే ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని అందులో ఒక హీరోయిన్ పేరు ‘D’ అనే లెటర్ తో ఉంటుందని.. ఈ సినిమాను లీడ్ చేసే పాయింట్ అదేనని తెలుస్తోంది.
అప్పటి పెళ్ళిసందడి మూవీ లో ఒక స్వప్నసుందరి.. ఆమె నాభి దగ్గర పుట్టుమచ్చ.. ఆమెను కలలో చూసి హీరో ప్రేమిస్తాడు . అదే అమ్మాయి హీరో జీవితంలోకి అడుగుపెడుతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు అక్క, చెల్లెళ్ళు.. వారి అనురాగం, త్యాగం ఆ కథను లీడ్ చేసే పాయింట్స్ అయ్యాయి. అలాంటి ఓ కీ పాయింటే ఇప్పుడు రాబోయే ’పెళ్ళిసందD’ లోనూ ఉండబోతోందట. ఇక ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. అతడి సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారు. ప్రస్తుతం హీరోయిన్స్ అన్వేషణలో మేకర్స్ ఉన్నారట. అప్పటి సినిమాకి అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణే ఈ మూవీకి కూడా సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఆరు పాటల ట్యూన్స్ సిద్ధం చేశారట. మరి ఈ ‘పెళ్ళిసందD’ కూడా అప్పటి సినిమాలాగానే మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.