నాడు- నేడు.. గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉండేవి? ఇప్పుడు వాటిని ఎలా మారుస్తామో చూడండి. అందుకే నాడు పరిస్థితి ఎలా ఉందన్న దానిని ఓ ఫొటో తీసిపెట్టి.. నేడు చేపట్టిన పనుల తర్వా త మో ఫొటో తీసి.. ఆ రెంటినీ పక్కపక్కనే పెట్టి తేడా ఏమిటో చూపిస్తామంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఓ ప్రకటన చేశారు. సర్కారీ స్కూళ్లను బాగు చేస్తామంటే వద్దనేవారు ఎవరుంటారు? విపక్షాలు కూడా ఈ పథకంపై పెద్దగా ఆరోపణలేమీ చేయడం లేదు. అయితే పనులు చేపడుతున్న ప్రధానోపాధ్యయులు, టీచర్లు పనిభారం పెరిగిపోయిందని గగ్గోలు పెట్టారు. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నాడు- నేడు పనుల్లో నాణ్యత ఏ పాటిదో ఇప్పుడు తేలిపోయింది. పనుల్లో అసలు నాణ్యతా ప్రమాణాలే పాటించడం లేదని తేలిపోయింది. వందలు, వేల కోట్ల నిధులను విడుదల చేస్తున్న ప్రభుత్వం ఆ పనులను మాత్రం కాంట్రాక్టర్లకు అప్పజెప్పేసి చేతులు దులుపుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏం జరిగిందంటే..?
నాడు- నేడు కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. పనులూ మొదలైపోయాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం బురాన్ దొడ్డిలోని సర్కారీ బడిని నాడు- నేడుతో కొత్తగా తీర్చిదిద్దారు. కొత్తగా భవనాలు కట్టారు. అప్పటికే ఉన్న భవనాలకు మరమ్మతులు చేసి రంగులేశారు. రంగురంగు బెంచీలను ఏర్పాటు చేశారు. ఇంకేముంది.. సర్కారీ బడికి కార్పొరేట్ కళ వచ్చేసింది. అయితే మంగళవారం నాడు విద్యార్థులు బుద్ధిగా చదువుకుంటుండగానే.. ఓ తరగతి గది పైకప్పు ఉన్నట్టుండి కుప్పకూలి.. సరిగ్గా విద్యార్దుల తలలపై పడింది. ఈ ఘటనలో ఎందరికి గాయాలయ్యాయో తెలియదు గానీ.. ఓ విద్యార్థి తరలకు తీవ్ర గాయమైంది. కుట్లూ పడ్డాయి. ఈ ఘటన గ్రామంలోని పిల్లలు, తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.
నాణ్యత ఉంటే కుప్పకూలేదా?
నాడు- నేడు పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్ద పీట వేయాలని సీఎం జగన్ చెబుతూనే ఉన్నారు. అయినా కూడా ఎక్కడ కూడా పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు జరగడం లేదు. వైసీపీ వర్గానికి చెందిన వారే కాంట్రాక్టర్లుగా మారిపోయిన నేపథ్యంలో పనులు పర్యవేక్షిస్తున్న టీచర్లు గానీ, ఇంజినీరింగ్ అధికారులు గానీ నోరు మెదపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెరసి నాడు- నేడు పనులు విద్యార్థుల ప్రాణాలకు పెను ముప్పుగా పరిణమించాయని చెప్పక తప్పదు.











