ఆశయం కోసం సాగుతున్న యాత్రలో అలజడులేలా!
భావితరాల భవిష్యత్తు కోసం .. రాజకీయ అనాలోచిత చర్యకు నిరసనగా రైతులు ఒకటే రాజధాని కావాలని అమరావతి వేదికగా గత రెండేళ్లుగా నిసనలు, ఉద్యమాలు, ధర్నాలు చేస్తూ ఐక్య ఎంజెండాతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో మహా పాదయాత్రకు పిలుపునిచ్చారు. గత 12 రోజులుగా పాదయాత్ర గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదిగా సాగుతోంది. ఈ క్రమంలో పాదయాత్రకు అధికారపార్టీ అడ్డంకులు సృష్టించి, అలజడులను రేపుతోంది. అధికారపార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిపై మాకెటువంటి అభ్యంతరాలు లేవని, నేడు అధికారంలోకి రాగానే నిరభ్యతరంగా మూడు రాజధానులంటే ఎలా? అని పాదయాత్రలో నినదిస్తూ కోర్టు నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు, ఆరంభించిన తరువాత అన్నిరాజకీయ పార్టీలు .. పార్టీలకు అతీతంగా మద్దతును ప్రకటించాయి. మహాపాదయాత్ర దారిపొడవున రైతలకు నిరాజనాలను పలుకుతూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. రైతు పాదయాత్రలో రాజకీయ ప్రయోజనాలు, దురుద్దేశాలు లేవని అధికారపార్టీ గుర్తించాలి. రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు, విశేషంగా రైతుల సంఘాలు, అశేషంగా అన్నిప్రాంతాలు రైతులు వచ్చి పాదయాత్రకు, రాజధాని అమరావతికి మద్దతు ప్రకటిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.
ఏరులా సాగుతూ .. మహోగ్రం దాల్చిన పాద యాత్ర!
అన్నంపెట్టే రైతు ఉద్యమం చేస్తున్నాడంటే అన్ని వర్గాల నుంచి మద్దతు కామన్ గా వస్తోంది. అది సహజం. ఎందుకంటే స్వాతంత్ర్యం రాకముందు, వచ్చిన తరువాత కూడా ఎన్నో రైతు ఉద్యమాలను చూశాం కాబట్టి. ప్రస్తుతం రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో చేస్తున్న ఉద్యమ సారథులు కూడా రైతులే కాబట్టి. దానికి రాజకీయరంగు పులిమితే జాతి ప్రయోజనాలు దెబ్బతినవా? అంటూ వాదనలు లేకపోలేదు. మహాపాదయాత్ర ప్రారంభం అయినాటినుంచి రాజకీయ రంగు పులిమి ప్రయత్నం అధికారపార్టీ మానుకోవాలని మేధావులు హితవు పలుకుతున్నారు. నియంతలా ఆంక్షలు, నిబంధనలను ఆదేశిస్తే .. ఆధ్యాత్మిక చింతనతో కూడిన పాదయాత్ర దండ యాత్రగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న సంకేతాలు లేకపోలేదు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం ఆనాడు గాంథీ జీ ప్రారంభించిన దండి యాత్రకు జాతి మొత్తం నిరాజనాలు పలికారు. ఆనాడు దండి యాత్రకు వచ్చిన ఆధారణే నేడు రైతు మహాపాదయాత్రకు వస్తుంది. రైతులను చూసి వారితో కలిసి నడవాలని కొందరొస్తుంటే .. పాదాలు కందకుండా పూలు జల్లేవారు, హారతులిచ్చే వారు మరికొందరు, దాచుకున్న డబ్బులిచ్చేవారు ఇంకొందరు, ఫెన్షన్లు విరాళమిచ్చే వృద్ధులు .. ఇలా చెప్పుకుంటూపోతే అన్ని వర్గాల నుంచి పాదయాత్రకు అనుహ్యం రీతిలో మద్దతు పెరుగుతోంది. అందుకేనేమో లాఠీలతో కొడుతుంటే ప్రజలు కవచంలా నిలబడుతున్నారు. ఆంక్షలతో ఆటంకాలు కల్పిస్తే ఆదరణతో అక్కున చేర్చుకుంటున్నారు. దారులన్నీ మూసివేస్తే గమ్యానికి దారి చూపుతున్నారు. సొంత కుటుంబ సభ్యులుగా ఆధరిస్తూ రైతులను తిరుమలకు పంపుతున్నారు. ఒక్కమాటలో చెప్పలంటే అమరావతి పరిరక్షణ కోసం సాగిన పాదయాత్ర కొందరితో ప్రారంభమై.. సకల జనుల యాత్రగా సాగి సంద్రోహంగా మారి ఒకటే రాజధాని అని నినదిస్తోంది.











