సం( క్షోభం)క్షేమంతో గెట్టెక్కగలరా?
ఏపీలో రాజకీయ క్లైమేట్ ఒక్కసారిగా మారింది. ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఏపీలో పెద్ద రాజకీయ చర్చకే దారితీసింది. అంతేకాక ముందస్తుకు అధికార వైసీపీ సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది! మొన్న గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు, నేడు( మంగళవారం ) 8 మంది ఐఏఎస్ ల బదిలీ వంటివి చూస్తే.. ముందుస్తుకు వెళ్లెందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది! మరోవైపు జిల్లాల వారీగా వైసీపీ తరుఫున పీకే టీం సర్వేలను వడివడిగా పూర్తి చేస్తోంది! ప్రజల్లో పలుకుబడిలేని, వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్ ను ప్రిపేర్ చేసి, వారి స్థానాల్లో తక్షణమే నియోజకవర్గ బాధ్యులను ఏర్పాటు చేసే విధంగా వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైనా జగన్ రెడ్డిలో పూర్తిగా ఓటిమి భయం పట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే సర్వతోముఖంగా వ్యతిరేకతను అన్ని వర్గాల నుంచి మూటకట్టుకున్న వైసీపీ..అధికారంలో ఉండి కాలయాపన చేసేకొద్ది ఇంకా ప్రజలు తిరగపడే ప్రమాదం ఉందని పసికట్టింది. అందుకే నవ (రాళ్లు) రత్నాలతో అందిస్తున్న సం(క్షోభ) క్షేమ పథకాలను అస్త్రంగా మలచుకుని ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ చూస్తోంది! మరోవైపు వైసీపీ ఎన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నా.. ఇసుక, మద్యం, మూడు రాజధానుల నాటకం, పెరుగుతున్న నిత్యావరసరాల ధరలు, ఉద్యోగులు జీతాల వెతలు, యువతను వెంటాడుతున్న నిరుద్యోగం, రైతును నిండా ముంచిన వైసీపీ హామీలు .. వంటివి చాలు అధికారపార్టీకి అధికారాన్ని ఊడగొట్టడానికని రాజకీయ విశ్లేషణలు లేకపోలేదు!
సమయం లేదు మిత్రమా.. ముందస్తుకు సిద్ధంకండి!
వైసీపీ ఏపీలో రోజురోజుకు పతనమౌతోంది. ఏపీ కోస్టల్ కారిడార్ లో కొన్ని పోర్టులను ప్రైవేటుపరం చేయడమేకాక విశాఖ స్టీల్ ను కూడా కార్పోరేట్ సంస్థలకు ధారాదత్తం చేసే కుట్రలను ప్రజలకు బాగానే అవగతమవుతోంది. ఇది ఉత్తరాంధ్ర ప్రజలను దహించి వేస్తోంది! కేంద్రంలోని బీజేపీతో అంటకాగడంమే.. తన తలకు తానే కొరివి ముట్టించుకున్నట్లుగా భావిస్తున్నారు విశ్లేషకులు! పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు విడుదల చేస్తున్న అలసత్వం కారణంగా అసలు పూర్తి అవుతుందా? లేదా? అన్న కలవరం మరోవైపు ప్రజల్లో మొదలైంది. వైఫల్యాలను బేరీజు చేసుకుని.. ప్రజల్లో ఇంకా తిరుగుబాటు ముందరక మునిపే ముందస్తుకు వెళ్లే ఆలోచనలో అధికార వైసీపీ ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైసీపీ పాలనును, ఎత్తుగడలను నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ అందుకు తగ్గట్లు వ్యూహాలకు పదును పెడుతోంది. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్లు , అనుబంధ విభాగాల అధ్యక్షులతో చంద్రబాబు ఆన్లైన్ లో సమావేశం నిర్వహించారు. మందస్తుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసీపీ వద్ద అధికారం,డబ్బు ఉంటే.. టీడీపీ పట్ల ప్రజల్లో నమ్మకం, విశ్వాసం వంటివి దండిగానే ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ ఆత్మవిశ్వాసమే టీడీపీని విజయ తీరాలకు చేరుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు. మరో వైపు జనసేన కూడా ఏపీ వ్యాప్తంగా సభ్యత్వాల నమోదు కార్యక్రమంతో బిజీబిజీగా గడుపుతోంది. ఇంకోవైపు కమల దళం కూడా విశాఖ రైల్వే జోన్ అంటూ పాత చింతకాయ పచ్చడికి కొత్త తాళింపు దట్టించి ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది! మొత్తంగా ఏపీలో ముందస్తుకు అధికార విపక్షలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది!!
Must Read:-తాడిపత్రిలో రగులుతున్న రాజకీయం! తగ్గేదేలే అంటున్న టీడీపీ!!