స్టూవర్ట్ పురం సెటిల్ మెంట్ గ్యాంగ్ కు చెందిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కిన సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజ్ రవితేజను తొలిసారి పాన్ ఇండియా హీరోని చేసిన సినిమా ఇది. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైంది. సినిమా ఎలా ఉందో విశ్లేషణ చేద్దాం.
కథలోకి వెళితే..
సాధారణంగా బయోపిక్ లు తీయాలంటే కత్తిమీద సామే. పైగా దొంగ జీవితం మరీ కష్టసాధ్యం. ప్రధానంగా ఇది 1970-80ల మధ్య కాలంలో సాగే కథ. నాగేశ్వరరావు గురించి విన్నవారేగానీ చూసిన వారు ఎవరూ లేరు. 1956లో తన 8 ఏళ్ల వయసులోనే తండ్రి తల నరికి తీసుకు వెళ్లడంతో అతని నేర చరిత్ర ప్రారంభమవుతుంది. నాగేశ్వరరావు కథంతా ప్రధాన మంత్రి కార్యాలయంలో ఆంధ్రా నుంచి వచ్చిన పోలీసు అధికారి చెప్పడంతో సాగుతుంది. నాగేశ్వరరావు అంచెలంచెలుగా ఎదుగుతూ తన నేరసామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడో చూపించారు. దొంగతనంలో మెళకువలను ఆ ఊళ్లో సీనియర్ దొంగ గజ్జెల ప్రసాద్ నుంచి తెలుసుకుంటాడు.
పోలీసులకే సవాలు విసరి దొంగతనాలు చేయడం అతని నైజం. రాజమండ్రి బ్యారేజీ మీద గూడ్స్ రైలులోని ఆహార పదార్థాలను దొంగిలించడం, ఓడల్లో బంగారాన్ని దోచుకోవడం, 24 మందిని ఊచకోత కోయడం లాంటి ఎన్నో సన్నివేశాలను మనం ఇందులో చూడవచ్చు. దొంగకు మనసు దోచుకోవడం కష్టమేముంటుంది. సారా (నుపూర్ సనన్) మనసు కూడా అలాగే దోచుకుంటాడు. అతను ఈ దొంగతనాలు ఎందుకు చేశాడు? ప్రధాన మంత్రి ఇంట్లో ఏం దోచుకున్నాడు? ఆ స్టూవర్ట్ పురం దొంగలకు హేమలతా లవణం ఎలాంటి సహకారం అందిస్తుంది? లాంటి ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే దొరుకుతుంది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఇలాంటి సినిమాలను కమర్షియల్ ఎలిమెంట్సుతో తీయాలంటే సినిమాటిక్ లిబర్టీ చాలా అవసరం. దర్శకుడు వంశీ అదే పని చేశారు. బయోపిక్ ను బయో పిక్ లా తీస్తే అదో డాక్యుమెంటరీ అవుతుంది. అందుకే కమర్షియల్ హంగులతో తీర్చిదిద్దారు. అతన్ని ఓ రాబిన్ హుడ్ లా మార్చారు. కథలో వక్రీకరణ చాలా జరిగింది. అతనిలో మార్పు తెచ్చిన హేమలతా లవణం పాత్రను అతనికి సహకరించిన పాత్రగానే చూపించారు. దాంతో హేమలత పాత్రకు ప్రయోజనం లేకుండా పోయింది. సీబీఐ చీఫ్ గా అనుపమ్ ఖేర్ ను చూపించినా అది కూడా నామ్ కే వాస్తిలా మిగిలిపోయింది. 10 శాతం కథకు 90 శాతం మసాలా అద్దే ప్రయత్నం చేశారు. రవితేజ మరోసారి మాస్ సత్తా చూపారు. ఒక విధంగా సినిమాని తన భుజస్కందాలపై మోశారు.
దర్శకుడు ఇష్టపడి ఎంచుకున్న ఈ కథను చెప్పడానికి కూడా చాలా కష్టపడ్డాడు. సినిమా ఫెయిలైనా దర్శకుడు మాత్రం ఫెయిల్ కాలేదు. కాకపోతే సినిమా నిడివి పెరగడం ప్రధాన మైనస్. స్లో నెరేషన్ కొంపముంచింది. ద్వీతీయార్థంలో సాగదీత సన్నివేశాలు చాలానే ఉన్నాయి. దొంగ జీవితాన్ని తెరకెక్కించి సభ్య సమాజానికి ఏం చెప్పాం అంటే మన దగ్గర సమాధానం ఉండదు. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. డైలాగు విషయంలో మంచి కసరత్తే జరిగింది. ఆలోచింపజేసే సంభాషణలు చాలానే ఉన్నాయి. కథ రీసెర్చ్ విషయంలో దర్శకుడు పడ్డ శ్రమ కూడా తెలుస్తుంది, కేజీఎఫ్ లా మలచాలన్న తాపత్రయం కనిపిస్తుంది. పుష్ఫ మాదిరిగా జనం రిసీవ్ చేసుకోవచ్చ ఆలోచన కూడా దర్శకుడిది కావచ్చు. రీరికార్డింగ్, పాటలు కొంత మైనస్ అని చెప్పాలి. సినిమా నిడివి కొంత తగ్గించి, సోలో విడుదలకు ట్రై చేసి ఉంటే ఫలితం వేరేగా ఉండేది.
నటీనటులు: రవితేజ, అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్త, మురళిశర్మ, నాజర్ తదితరులు.
సాంకేతికవర్గం: కెమెరా ఆర్. మధి, సంగీతం జీవీ ప్రకాష్ కుమార్, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు శ్రీకాంత్ విస్సా
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం: వంశీ
విడుదల తేదీ: 20-10-2023
ఒక్క మాటలో: ఇటు టైగరూ కాదు అటు లైగరూ కాదు
రేటింగ్: 2.75/5
– హేమసుందర్